
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్: ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషి వంటి సీనియర్ నేతల మాదిరిగానే వెంకయ్య నాయుడును కూడా వదుల్చుకునేందుకు ప్రధాని మోదీ సిద్దపడ్డారని శనివారం తేలిపోయింది. ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖడ్‌ను ఎంపిక చేయడంతో ఈ విషయం నిర్ధారణ అయింది. రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయకపోయినా వెంకయ్యను ఉపరాష్ట్రపతిగా కొనసాగించే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావించారు. ఉపరాష్ట్రపతిగా ముక్తార్ అబ్బాస్ నక్వీని చేసే అవకాశాలు లేవని, దక్షిణాదికి అవకాశం దక్కవచ్చని ఒకట్రెండు రోజుల క్రితం బీజేపీ కార్యాలయంలో ఒక సీనియర్ నాయకుడు లీకులు వదిలారు. కానీ, అనూహ్యంగా జగదీప్ ధన్‌ఖడ్‌ను మోదీ తెరపైకి తీసుకొచ్చారు. జగదీప్ శుక్రవారమే ఢిల్లీకి వచ్చి, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసినా.. ఆయన పేరు ఎక్కడా లీక్ కాకుండా గోప్యత పాటించారు.
Also Read : ముంబైలో ఘనంగా తెలంగాణ ఆషాడమాస బోనాలు
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో రోజూ ఏదో ఒక రకంగా ఘర్షణ పడుతూ బెంగాల్‌ను గ్యాస్ చాం బర్‌గా అభివర్ణించిన ధన్‌ఖడ్‌ను రాజ్యాంగవేత్తగా ప్రధాని మోదీ కొనియాడడం విశేషం. 1991 వరకు జనతాదళ్‌లో ఉన్న ధన్‌ఖడ్ తర్వాత బీజేపీలో చేరారు. రాజస్థాన్ ఎన్నికల్లో జాట్‌ల పాత్రను దృష్టిలో ఉంచుకుని ఆయనను ఎంపిక చేసినట్లు భావిస్తున్నారు. 1993 వరకు ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వెంకయ్యనాయుడు తర్వా త బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టారు. జాతీయ నాయకత్వానికి తలలో నాలుకగా మారారు. పార్టీ అధికార ప్రతినిధిగా చమత్కార శైలిలో మాట్లాడి జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు, బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శిగా అనేక నిర్ణయాల వెనుక కీలక పాత్ర పోషించారు.
Read Also : కేసీఆర్ చెప్పిన క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటీ? ఆకస్మిక వరదలు స్పష్టించడం సాధ్యమ…
రాజ్యసభలో ప్రతిపక్షాలను చీల్చిచెండాడంలో తనకు తిరుగు లేదని నిరూపించుకున్న వెంకయ్య.. నాలుగు సార్లు రాజ్యసభకు ఎన్నికైన ఏకైక బీజేపీ నేతగా ఘనతను సాధించారు. 2002-04 మధ్య దాదాపు రెండేళ్ల పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న వెంకయ్య నాయుడు.. పార్టీ ఎన్నికల ప్రచారాన్ని తిరుగులేని విధంగా నిర్వహించారు. గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు మోదీపై చర్య తీసుకోవాలని వాజపేయి భావించినప్పటికీ ఆడ్వాణీతో పాటు మొత్తం పార్టీని మోదీకి అనుకూలంగా మార్చడంలో వెంకయ్య కీలక పాత్ర పోషించారు. వాజపేయి ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి మంత్రిగా.. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన వంటి కీలక పథకాలను ప్రవేశపెట్టగలిగారు. మోదీ ప్రభుత్వంలో ఆయన పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పేదరిక నిర్మూలన, పార్లమెంటరీ వ్యవహారాలు, సమాచార ప్రసారాలు తదితర శాఖలను నిర్వహించారు. అయితే పాత ఆడ్వాణీ గ్రూపు వారిని ఒక్కొక్కరినీ వదుల్చుకుంటూ వస్తున్న మోదీ.. అయిదేళ్ల క్రితం వెంకయ్యకు ఉపరాష్ట్రపతి పదవి అప్పగించి రాజకీయాలకు దూరం చేశారు. ఇప్పుడు వెంకయ్యకు ఏ పదవీ అప్పగించకుండా పూర్తిగా వదుల్చుకున్నారు. దీంతో.. కొన్ని దశాబ్దాల పాటు రాష్ట్ర, జాతీయ రాజకీయాలు నిర్వహించి, తెలుగు దనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలించిన వెంకయ్య శకం ముగిసినట్లయింది.
ఇవి కూడా చదవండి :
- ముంబైలో ఘనంగా తెలంగాణ ఆషాడమాస బోనాలు
- ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలు తెరిచి….. యువతులను మోసం చేసి
- ముఖ్యమంత్రి కెసిఆర్ పై బండి సంజయ్ ఫైర్…
2 Comments