
గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. రెండు రోజులుగా వర్షాలు కురవకున్నా గోదావరి ఉధృతంగానే ప్రవహిస్తోంది. ములుగు నియోజకవర్గంలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికి వందల గ్రామాలు జల దిగ్భందంలో ఉన్నాయి. సహాయ చర్యల్లో భాగంగా ములుగు జిల్లాలో ఎమ్మెల్యే సీతక్క ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైంది. ముంపు ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అనంతరం వాగు దాటుతుండగా పడవలో పెట్రోల్ అయ్యిపోయింది. దీంతో పడవ వాగు ఉధృతికి కొట్టుకు వచ్చి చెట్టును ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన సీతక్క, ఆమె అనుచరులు అందులో నుంచి దిగిపోయారు.
ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏటూరు నాగారం మండలం ఎలిశెట్టిపెల్లిలో ఘటన చోటుచేసుకుంది. గత మూడు రోజులుగా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఆ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పడవల్లోనే అంతా సాగిస్తున్నారు. ఈక్రమంలో ఎమ్మెల్యే సీతక్క ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు నిత్యావసరాలు అందించారు.
One Comment