
గోదావరి మహోగ్రరూపం కొనసాగుతోంది. కాళేశ్వరం నుంచి 28 లక్షలకు పైగా వరద వస్తుండటంతో భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చిరక జారీ చేయగా.. అంతకు ముంది ప్రమాదకర స్థాయిలో గోదారమ్మ ప్రవహిస్తోంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 68.3 అడుగులకు చేరింది. మధ్యాహ్నం 12 గంటలకు 69 అడుగులకు చేరింది. సాయంత్రానికి భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 70 అడుగులు దాటేసింది. శుక్రవారం రాత్రికి భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 75 అడుగులకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే భద్రాచలంలో పాటు బూర్గంపాడు. చర్ల మండలాల్లోని గ్రామాలు నీట మునిగాయి. నీటిమట్టం 75 అడుగులకు చేరితే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన నెలకొంది. ఈ రాత్రి గడిస్తే చాలని అధికారులు చెబుతున్నారు.
గోదావరి చరిత్రలో ఇప్పటివరకు రెండు సార్లు మాత్రం భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 70 అడుగులు దాటింది. 1986 ఆగస్టులో భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 75 అడుగులకు చేరింది. 1996 ఆగస్టులో 73 అడుగులు దాటి ప్రవహించింది. గోదావరి ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తుండటంతో భద్రాచలం వెళ్లే అన్ని దారులను గోదావరి ముంచెత్తింది. రాములోరి ఆలయాన్ని వరద చుట్టుముట్టింది. అన్నదాన సత్రం జలమలమైంది.భద్రాచలంలో ఇప్పటికే లోతట్టు కాలనీలు జలమలమయ్యాయి. వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరిలంతారు. కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీ, అయ్యప్ప కాలనీ, శాంతినగర్ పిస్తా కాంప్లెంక్స్ ఏరియా, సుభాష్ నగర్ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. వరదనీటిలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లు మునిగిపోవడంతో ముందుజాగ్రత్తగా అధికారులు కరెంట్ సరఫరా ఆపేశారు.
వరద పోటెత్తడంతో చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, బూర్గంపాడు, మణుగూరు, పినపాక మండలాల్లోని వందకు పైగా గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఆ మండలాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. భద్రాచలం, బూర్గంపాడు మధ్యనున్న వారధిపై రాకపోకలను నిలిపివేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి భద్రాచలంలో చిక్కుకున్న గిరిజనుల కోసం ఐటీడీఏ అధికారులు ప్రత్యేక పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు.ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, భద్రాది జిల్లా కలెక్టర్ అనుదీప్ భద్రాచలంలోనే ఉండి వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
భద్రాచలం వరద పరిస్థితిపై సీఎం కేసీఆర్ రివ్యూ చేశారు. ఊహించని వరదలకు జలమయమవుతున్న లోతట్టు ప్రాంతాల్లో ప్రజా రక్షణ చర్యలు చేపట్టేందుకు కావాల్సిన ఎన్డీఆరెఫ్ సిబ్బందిని, రెస్కూ టీంలు సహా హెలీకాప్టర్లను అందుబాటులోకి తేవాలని సిఎం కేసీఆర్ ఆదేశించారు. భద్రాచలంలో ఉండి క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ అభ్యర్థన మేరకు హెలికాప్టర్ ను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. రదబాధితులను రక్షించేందుకు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉపయోగ పడే లైఫ్ జాకెట్లు., తదితర రక్షణ సామగ్రిని ఇప్పటికే తరలించారని, అదనంగా మరిన్నింటిని తరలించాలని సూచించారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు సీఎం కేసీఆర్.