
తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. పార్టీల మధ్య సవాళ్లు విన్పిస్తున్నాయి. దూకుడుగా ప్రజల్లోకి వెళుతున్న పార్టీలు.. తమ బలాబలాలు, అభ్యర్థుల ఎంపికపై జోరుగా సర్వేలు నిర్వహిస్తున్నాయి. తాజాగా తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలుస్తుందన్న దానిపై ఆరా సంస్థ సర్వే నిర్వహించింది. ఆరా సర్వే సంస్థకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. గతంలో ఆరా ఇచ్చిన ప్రీపోల్, ఎగ్జిట్ పోల్ సర్వేలు నిజమయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కు 85 నుంచి 90 సీట్లు వస్తాయని ఆరా సంస్థ అంచనా వేయగా ఫలితాలు అలానే వచ్చాయి. రాజకీయ పార్టీలు ఆరా సంస్థ సర్వేపై నమ్మకంగా ఉంటాయి. దీంతో తాజాగా తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుందన్న దానిపై ఆరా సర్వే ఇచ్చిన నివేదిక సంచలనంగా మారింది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీలు అంటే అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీల బలాబలాలు, ఓటర్ల నాడి ఎలా ఉందనే అంశంపై 2021 నవంబర్ నుంచి 2022 జూలై వరకూ మూడు దశల్లో ఆరా సంస్థ సర్వే నిర్వహించింది. సర్వేలో అన్ని రకాల నియోజకవర్గాల ఓటర్ల మూడ్ తెలిసేట్టు..6-7 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు, 3-4 ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు, అర్బన్ నియోజకవర్గాలు 10-11, రూరల్ నియోజకవర్గాలు 18-19 వాటిలో సర్వే నిర్వహించారు. ఆరా సర్వే ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకే లీడ్ వచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ పార్టీకి 38.88 శాతం ఓట్లు వస్తాయని ఆరా సంస్థ తెలిపింది.
2018 ఎన్నికల్లో 46.87 శాతం ఓట్లు సాధించిన టీఆర్ఎస్ 88 సీట్లు గెలిచింది. ఆ తరువాత 4 నెలలకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 5 శాతం ఓట్లు కోల్పోయింది. ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 8 శాతం ఓట్లు కోల్పోయి 38.88 శాతం ఓట్లను పొందవచ్చని ఆరా సర్వేలో తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 28.43 శాతం ఓట్లు సాధించిన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఆ తరువాత అంటే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 29.78 శాతం ఓట్లు సాధించింది. ఇప్పుడు ఈ సర్వేలో గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే..4.72 శాతం ఓట్లను కోల్పోయి..23.71 శాతానికి పరిమితం కానుందని ఆరా సంస్థ వెల్లడించింది. ఇక బీజేపీ 2018 ఎన్నికల్లో 6.98 శాతం ఓట్లు సాధించగా..2019 పార్లమెంట్ ఎన్నికల్లో 19.65 శాతం ఓట్లు దక్కించుకుంది. ఇప్పుడు నిర్వహించిన సర్వేలో 23.5 శాతం అధికంగా ఓట్లు సాధించి..మొత్తం 30.48 శాతం దక్కించుకోనుందని తెలిపింది.
ఆరా సర్వే ఫలితాల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ తీవ్రంగా ఉండగా..వరంగల్, ఖమ్మం, నల్గొండలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుంది. ఇక మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో త్రిముఖ పోటీ నెలకొందని ఆరా వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 16 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉండగా..8 నియోజకవర్గాల్లో 4వ స్థానంలో నిలిచింది. అంటే పాతబస్తీ మినహా మిగితా గ్రేటర్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉంది.
2 Comments