
చార్ ధామ్ యాత్రలో భాగంగా నిర్వహించే అమర్ నాథ్ యాత్రపై వరుణుడు పంజా విసిరాడు. జమ్మూకశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలోని అమర్ నాథ్ క్షేత్రం వద్ద భారీ వర్షం కురిసింది. దాంతో ఆలయ పరిసరాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఒక్కసారిగా వరద నీరు పెరిగిపోవడంతో పలువురు భక్తులు అందులో చిక్కుకుపోయారు. కొండలపైనుంచి వరద నీరు భారీగా రావడంతో సమీపంలోని గుడారాలతో పాటు భక్తులు కూడా కొట్టుకుపోయారు. 9 మంది చనిపోయారు. పలువురు గల్లంతయ్యారు. ఇప్పటివరకూ ఏడుగురిని కాపాడారు. కుంభవృష్టి సమయంలో Amarnathలో 12 వేల మంది భక్తులున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ITBP, CRPF, BSF, NDRF, SDRF బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
పక్కనే ఉన్న గుహ చుట్టు పక్కల 12 వేల మంది వరకు భక్తులు ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో కొందరి ఆచూకీ తెలియరాలేదు. వేలమంది భక్తులు వరద ప్రభావానికి గురైనట్టు భావిస్తున్నారు. ఇప్పటివరకు 9 మంది మృతి చెందినట్టు గుర్తించారు. భారీ వర్షం, వరద నేపథ్యంలో సైనికులు, ఐటీబీపీ జవాన్లు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఘటనపై తాను లెఫ్టెనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో మాట్లాడానని అమిత్ షా ట్వీట్ చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. సైన్యంతో పాటు ఇతర బలగాల సాయంతో సహాయక కార్యక్రమాలు చేపట్టామని ఐటీబీపీ పీఆర్ఓ వివేక్ కుమార్ పాండే తెలిపారు.