
వరి కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ సర్కార్ మధ్య గ్యాప్ మరింత పెరుగుతోంది. ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి వచ్చారు తెలంగాణ మంత్రులు. అక్కడ ఎలాంటి హామీ లభించకపోవడంతో హైదరాబాద్ తిరిగొచ్చారు. ఢిల్లీలో కేంద్రమంత్రులతో జరిగిన చర్చల వివరాలను ముఖ్యమంత్రి కేసీఅర్ ను కలిసి వివరించారు మంత్రులు. కేసీఆర్ ఆదేశాలతో మీడియా ముందుకు వచ్చిన మంత్రులు.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.పంటలను కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి.
తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. తెలంగాణకు ఏ విషయంలోనూ మోడీ సర్కార్ సహకరించడం లేదన్నారు.వరి కొనుగోళ్లపై కేంద్రమంత్రులు పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రమంత్రుల అవగాహన రాహిత్యాన్ని తెలంగాణ ప్రజలు సహించరని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మార్పులు సూచిస్తే స్వీకరించే ఔదార్యం కూడా కేంద్ర మంత్రులకు లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులను కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అవమానించారని నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్రమంత్రి రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర మంత్రులను అవహేళన చేస్తూ మాట్లాడారని మండిపడ్డారు. తెలంగాణలో నూకలు తినే అలవాటును పెంచమంటూ ప్రజలను అవమానించారని చెప్పారు.
వరి సాగు చేయండని.. రైతులను రెచ్చగొట్టిన తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పుడెందుకు కేంద్రాన్ని అడగట్లేదని మంత్రులు నిలదీశారు. తెలంగాణలో యాసంగి వడ్లు మిల్లింగ్ చేస్తే నూకలు ఎక్కువగా వస్తాయన్నారు. బాయిల్డ్ రైస్ కొనకపోతే ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం కొని కేంద్రమే మిల్లింగ్ చేసుకోవాలని సూచించారు. బియ్యం ఎగుమతులను పెంచుకునే ప్రయత్నాలను కూడా కేంద్రం చేయట్లేదని విమర్శించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో బియ్యం కొరతను తీర్చే సదుద్దేశం కూడా కేంద్రానికి లేదన్నారు తెలంగాణ మంత్రులు. రైతుల సమస్యను పరిష్కరించేలేని కేంద్ర ప్రభుత్వం ఎందుకు? అని ప్రశ్నించారు.
One Comment