
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణలో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్, ఈడీ శాఖల మధ్య వార్ జరుగుతోందని తెలుస్తోంది. ఈకేసును ఎక్సైజ్ , ఈడీ శాఖలు వేర్వేరు దర్యాప్తు చేశాయి. అయినా డ్రగ్స్ కేసు కొలిక్కి రాలేదు. మొదట ఎక్సైజ్ శాఖ కేసు విచారణలో భాగంగా ప్రధాన నిందితుడు కెల్విన్‌తోపాటు సినీ తారలను విచారించింది. పలు దఫాలుగా సినీ నటులతోపాటు ఇతరులను విచారించింది. ఈకేసులో మనిల్యాడరింగ్ జరగడంతో ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈడీ సైతం పలువురిని విచారించింది. త్వరలోనే కేసు కొలిక్కి వస్తుందని అంతా భావించారు.
కాని ఇప్పుడు కొత్త అంశం తెరపైకి వచ్చింది. కేసు విచారణలో కీలకంగా ఉన్న ఆధారాలను ఎక్సైజ్ శాఖ తమకు ఇవ్వడం లేదని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈమేరకు హైకోర్టును సైతం ఆశ్రయించారు. డ్రగ్స్ కేసులోని వాంగ్మూలాలు, ఆధారాలను ఈడీకి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఐనా తమకు ఎక్సైజ్ శాఖ సహకరించడం లేదని ఈడీ అంటోంది. ఈక్రమంలోనే కోర్టు ధిక్కారణ పిటిషన్‌ను వేసింది. పిటిషన్‌లోని కీలక అంశాలు ఇప్పుడు వెలుగు చూశాయి.
సీఎస్ సోమేష్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్‌లపై చర్యలు తీసుకోవాలని ధిక్కరణ పిటిషన్‌లో ఈడీ పేర్కొంది. కెల్విన్ కు సంబంధించిన కాల్ రికార్డులను ఇవ్వలేదని తెలిపింది. తాము సేకరించిన ఆధారాలు ట్రైల్ కోర్టులో ఉన్నాయన్న ఎక్సైజ్ శాఖ వాదనలో వాస్తవం లేదని ధిక్కారణ పిటిషన్‌లో ఈడీ అధికారులు స్పష్టం చేశారు.
12 కేసుల్లో 23మంది నిందితులున్నా..ఐదుగురు వాంగ్మూలాలు మాత్రమే ట్రైల్ కోర్టులో లభ్యమయ్యాయని..సినీ తారల కాల్ రికార్డులను కోర్టుకు ఇవ్వలేదని తెలిపింది. సమగ్ర దర్యాప్తు వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా పాటించలేదని పేర్కొంది. ఈడీ వేసిన ధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం విచారణ జరగనుంది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసును పూర్తిగా విచారించి..నిందితులు ఎవరో నిగ్గు తేల్చుతామంటున్నారు ఈడీ అధికారులు. ఈకేసు విచారణలో భాగంగా పలువురికి నోటీసులు ఇస్తారని తెలుస్తోంది. టాలీవుడ్ డ్రగ్స్‌కేసు మళ్లీ తెరపైకి రావడంతో సినీ తారల్లో గుబులు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది.
2 Comments