
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావని చెప్పారు కేసీఆర్. అదే సమయంలో రాష్ట్రంలోని అన్నినియోజకవర్గాల్లో సర్వేలు జరిపిస్తున్నానని తెలిపారు. ఇక్కడో ఏదా తేడా కొడుతుందనే చర్చ జరుగుతోంది. ముందస్తు ఎన్నికలు లేవంటే 2023 డిసెంబర్ వరకు ప్రభుత్వానికి గడువు ఉన్నట్లే. మరీ అలాంటప్పుడు పీకే టీమ్ తో సర్వేలు ఎందుకు చేయిస్తున్నారన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది.
పార్టీ నేతలతో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. సర్వే రిపోర్ట్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు సంస్థలు 30 స్థానాల్లో సర్వే చేసి నివేదిక ఇచ్చాయన్నారు. 30 స్థానాలకు గాను 29 చోట్ల టీఆర్ ఎస్ గెలుస్తుందన్నారు. అలాగే ఈసారి 95-105 సీట్ల మధ్య గెలుస్తామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల పరిస్థితిపై మరో 25 రోజుల్లో నివేదిక బహిర్గతం చేస్తామన్నారు . దీంతో ముందస్తు ఎన్నికలపై రాజకీయవర్గాల్లో మళ్లీ చర్చ మొదలైంది.
ఇటీవలే 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటించారు. నోటిఫికేషన్లపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఎందుకంటే గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఊసే లేదు. ఎన్నికల సందర్భంలోనే నిరుద్యోగులను మభ్యపెట్టడానికి ప్రకటనలు చేస్తున్నారని విపక్ష నేతల ఆరోపిస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో.. ఆ అసంతృప్తిని చల్లార్చడానికి ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయాలు వస్తున్నాయి. ప్రభుత్వంపై ఇంకా పూర్తి వ్యతిరేకత రాకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని గులాబీ బాస్ యోచిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీన్ని టీఆర్ఎస్ నేతలు ఖండించినా, సీఎం కేసీఆర్ ముందస్తు ముచ్చటే లేదని కరాఖండిగా చెప్పినా…రాష్ట్రంలో ఎన్నికల వేడి మాత్రం మొదలైంది. ముందస్తు ఎన్నికలు ఖాయమనే ప్రచారమే జరుగుతోంది.