
క్రైమ్ మిర్రర్, నల్గొండ : భూమి, భుక్తి, విముక్తి కోసం పదహారేళ్ల వయసులోనే తుపాకీ పట్టి పోరాడిన వీరనారి మల్లు స్వరాజ్యం శకం ముగిసింది. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం అంతిమయాత్ర నల్గొండ పట్టణంలో భారీగా తరలివచ్చిన అభిమానులు,నాయకులు కార్యకర్తల అశ్రునయనాల మధ్య సాగింది. దారి పొడవునా ఎర్ర జెండాలతో మల్లు స్వరాజ్యం అంతిమయాత్ర సాగింది. కామ్రేడ్ మల్లు స్వరాజ్యం అమర్ రహే అంటూ అగ్ర నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. పార్టీల కతీతంగా పలు పార్టీల నాయకులు మల్లు స్వరాజ్యం పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Read More : మెడికల్ కాలేజీకి మల్లు స్వరాజ్యం పార్థీవదేహం
ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు హైదరాబాద్ ఎంబీ భవన్లో ప్రజల సందర్శనార్ధం ఉంచిన మల్లు స్వరాజ్యం పార్థివదేహం అక్కడి నుంచి నేరుగా నల్లగొండలోని సీపీఎం పార్టీ కార్యాలయానికి తరలించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం3:30 వరకు ప్రజల సందర్శనార్థం మల్లు స్వరాజ్యం పార్థివ దేహాన్ని ఉంచారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి పెద్ద ఎత్తున మల్లు స్వరాజ్యం అభిమానులు తరలివచ్చి నివాళులర్పించారు. కళాకారులు కోలాటాలు, పాటలతో అంతిమ వీడ్కోలు పలికారు. అనంతరం నల్గొండ సీపీఎం కార్యాలయం నుండి పట్టణంలోని పలు వీధుల గుండా సాగిన మల్లు స్వరాజ్యం అంతిమయాత్ర నల్గొండ మెడికల్ కళాశాల వద్దకు చేరుకుంది. స్వరాజ్యం కోరిక మేరకు నల్గొండ మెడికల్ కళాశాలకు ఆమె పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులు అప్పగించారు.
నల్గొండ సీపీఎం కార్యాలయంలో మల్లు స్వరాజ్యం పార్థివ దేహానికి మంత్రి జగదీష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం పోరాట స్ఫూర్తి పలువురికి స్ఫూర్తి ధాయకమన్నారు. మహిళా హక్కుల కోసం సాగిన ఉద్యమాల్లో, ప్రజా ఉద్యమాల్లో స్వరాజ్యం ముందుండి నడిచిన గొప్ప నాయకురాలన్నారు. సమాజ మార్పు కోసం మహిళలు,పురుషులు వేరు కాదన్న గొప్ప సందేశం ఇచ్చిన నాయకురాలని కొనియాడారు. జిల్లాలో మల్లు స్వరాజ్యం లేని లోటు తీర్చలేనిదన్నారు.
నల్గొండ సీపీఎం కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, శానంపూడి సైదిరెడ్డి,మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి నివాళులర్పించారు. నల్గొండ సీపీఎం కార్యాలయం నుంచి ప్రారంభమై నల్గొండ మెడికల్ కళాశాల వరకు సాగిన మల్లు స్వరాజ్యం అంతిమయాత్రలో మంత్రి జగదీష్ రెడ్డి కాలినడకన నడిచారు. అంతిమ యాత్రలో ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు బీవీ.రాఘవులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీర భద్రం, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి పలువురు నాయకులు తరలివచ్చి నివాళులర్పించారు.
ఇవి కూడా చదవండి ..
- సీనియర్లకు హైకమాండ్ క్లాస్.. టీఆర్ఎస్ కుట్ర చేసిందా?
- ఎమ్మెల్యే కొడుకు కారులోనే ఉన్నాడు.. జూబ్లీహిల్స్ కేసులో ట్విస్ట్..
- కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారా? ఐటీ రైడ్స్ లో అడ్డంగా బుక్కయ్యారా?
- రష్యాపై యుద్ధానికి సిద్ధమవుతున్న 98 ఏళ్ల బామ్మ
- యూట్యూబర్ మరణానికి కొబ్బరిబొండాలే కారణమా?