Telangana

పంజాబ్ ఫార్ములా తెలంగాణలో.. ఎన్నికలే లక్ష్యంగా బరిలోకి ఆమ్ ఆద్మీ పార్టీ

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : మరో ఏడాదిలో ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్న తెలంగాణలో మెల్లిగా రాజకీయ ముఖచిత్రం మారుతోంది. ప్రస్తుతం ప్రధానంగా కనిపిస్తున్న పార్టీలకు అదనంగా మరిన్ని పార్టీలు రంగంలోకి దిగబోతున్న సంకేతాలు అందుతున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం దీన్ని ధృవీకరిస్తోంది. ప్రస్తుతం తెలంగాణాలో చాలా పార్టీలున్నా అందులో టి‌ఆర్‌ఎస్, బి‌జే‌పి, కాంగ్రెస్ పార్టీల మధ్యే త్రిముఖ పోటీ వుంటుందన్న అంచనాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. 

చిరకాలంగా స్తబ్దుగా మారిపోయిన వామపక్షాలకుతోడు మరిన్ని చిన్నా చితకాపార్టీలు కూడా తెలంగాణలో మనుగడలో వున్నాయి అనేలా అప్పుడప్పుడు దర్శనమిస్తుంటాయి. ఇంకోవైపు సోదరునితో విభేదాలు కావచ్చు.. మరేదైనా కారణం కావచ్చు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కూడా తెలంగాణ రాజకీయ యవనికపై తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించి.. తమ కుటుంబానికి కలిసొచ్చిన పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళుతున్నారు. అయితే తెలంగాణ మూలాలు అంతంత మాత్రంగా వున్న షర్మిలను ఈ రాష్ట్ర ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారన్నది ప్రశ్నార్థకమే. కరోనా కారణంగా నిలిపి వేసిన పాదయాత్రను షర్మిల మార్చి రెండో వారం నుంచి మళ్ళీ ప్రారంభించారు. ఇక మూడు ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు ముందస్తు వ్యూహాలకు అనుగుణంగా రాజకీయ కార్యకలాపాల వేగం పెంచాయి.

READ MORE : మహిళలను వేధిస్తున్న తెలంగాణ బీజేపీ నేత!

 అదేసమయంలో మూడు పార్టీల మధ్య మాటల యుద్దం కూడా పదునెక్కింది. ఇదిలా వుంటే.. తాజాగా ఢిల్లీ నుంచి దండయాత్రగా బయలుదేరిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన సంగతి తెలసిందే. 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో ఏకంగా నాలుగింట మూడొంతుల సీట్లు.. అంటే 92 సీట్లను గెలుచుకుంది. అంతకు ముందు ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని స్టాండప్ కమేడియన్ భగవంత్ సింగ్ మాన్‌ను పంజాబ్ ముఖ్యమంత్రిని చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. అవినీతిరహితంగా పాలించడమే కాకుండా.. అనేక ఉచిత తాయిలాలను అందిస్తే ప్రజల అభిమానాన్ని చూరగొనడమే కాకుండా ఎన్నికల్లో విజయం సాధించ వచ్చన్న ఫార్ములాను ఢిల్లీ, పంజాబ్ తర్వాత తెలంగాణలోను ఆచరించేందుకు, తద్వారా తెలంగాణలోను గణనీయంగా సీట్లు సాధించేందుకు ఆప్ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యూహరచన చేస్తున్నట్లు కథనాలు మొదలయ్యాయి. 

READ MORE : బ్రదర్ అనిల్ టార్గెట్ ఏంటీ? బీజేపీ డైరెక్షన్ లో ఉన్నారా?

పంజాబ్ ఫార్ములా తెలంగాణలో ఏమేరకు ఉపయోగపడుతుందో తెలియదు గానీ.. కేజ్రీవాల్ మాత్రం తెలంగాణ పర్యటనకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు ఏప్రిల్ రెండోవారంలో కేజ్రీవాల్ తెలంగాణలో పాదయాత్రకు సిద్దమవుతున్నట్లు సమాచారం. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కేజ్రీవాల్ తెలంగాణలో పాదయాత్ర ప్రారంభిస్తారని విశ్వసనీయ సమాచారం. దాదాపు పదేళ్ళ క్రితం ఏర్పాటైన ఆమ్ ఆద్మీ పార్టీ తొలుత ఢిల్లీ అసెంబ్లీపైనే ఫోకస్ చేసింది. గత ఎన్నికల్లో ఢిల్లీలో కనీ వినీ ఎరుగని ఘన విజయం సాధించిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర రాష్ట్రాలపై గురి పెట్టింది. 

పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీకి 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 20కి పైగా సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది. ఇటీవల అదే రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఏకంగా 92 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఢిల్లీ తర్వాత రెండో రాష్ట్రాన్ని కైవసం చేసుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. అయితే.. అదే తరుణంలో ఎన్నో ఆశలతో పోటీ చేసిన గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మాత్రం పెద్దగా సత్తా చాటలేకపోయింది. ఢిల్లీకి ఉపాధి కోసం తరలి వచ్చే ఉత్తరాఖండ్ యువకులు.. దేశ రాజధానిలో తమ ప్రభుత్వ పనితీరుకు మెచ్చి దేవభూమిలోను గెలిపిస్తారని అధికారాన్ని కట్టబెడతారని ఆశించిన కేజ్రీవాల్‌కు మొండిచేయి చూపారు ఉత్తరాఖండ్ ఓటర్లు. అదేసమయంలో గోవాలో ఎన్నో ప్రజాకర్షక ‘ఉచిత’ పథకాలను ప్రకటించి మరి ఎన్నికల బరిలోకి దిగినా పెద్దగా ఫలితం లేకపోయింది.

ఈ సంవత్సరాంతంలోనే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికల్లో జరగబోతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోను గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు కేజ్రీవాల్ పార్టీ అన్ని రకాలుగా సిద్దమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణపై ఆప్ పార్టీ ఫోకస్ చేయడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ చాలా బలీయంగా కనిపిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుకున్న ఎమ్మెల్యేలను కాపాడుకోలేక చతికిలా పడిన కాంగ్రెస్ పార్టీ ఓ వైపు.. ఆనాటి ఎన్నికల్లో కేవలం ఒకే సీటును (గోషామహల్‌లో రాజాసింగ్) మాత్రమే గెలుచుకున్న బీజేపీ ఇంకోవైపు గులాబీ పార్టీకి సవాల్ విసురుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీని ఓడిస్తామంటూ తొడగొట్టి మరీ చెబుతున్నాయి. అయితే.. గత ఎన్నికల్లో ఒకే ఒక సీటును దక్కించుకున్న బీజేపీ.. ఆ తర్వాత దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలో సత్తా చాటింది. 

ఉప ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించుకున్న బీజేపీ.. దూకుడు మీద కనిపిస్తోంది.2024 సార్వత్రిక ఎన్నికలు ముందుకు జరిగే సంకేతాలను గుర్తించిన గులాబీ దళపతి.. గతంలో లాగానే ఇంకో ఆరో, ఎనిమిదో నెలల ముందుగానో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళతారన్న ప్రచారం జోరుగా వినిపిస్తోంది. కొన్ని కథనాలు నిజమైతే తెలంగాణ అసెంబ్లీని 2022 నవంబర్ లేదా డిసెంబర్‌లోనే రద్దు చేస్తారని తెలుస్తోంది. అదే గనక జరిగితే 2023 నవంబర్ నెలలో జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే జరిగే అవకాశాలున్నాయి. దానికి అనుగుణంగానే తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రజల్లోకి వెళ్ళేందుకు ప్రణాళికాబద్దంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ రాష్ట్రంలో లభించిన ఊపును తెలంగాణకు విస్తరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తున్నట్లు కథనాలు మొదలయ్యాయి.

 తాజా సమాచారం నిజమైతే ఏప్రిల్ 14వ తేదీన కేజ్రీవాల్ పాదయాత్ర తెలంగాణలో ప్రారంభం కానున్నది. AAP సీనియర్ నేత సోమనాథ్ భారతిని తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా కేజ్రీవాల్ ఇదివరకే నియమించారు. ఆయన ఆధ్వర్యంలో ఆప్ పార్టీ తెలంగాణలోని పలువురు రిటైర్డ్ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అవినీతి వ్యతిరేక ఉద్యమంలో చిరకాలంగా పని చేస్తున్న వారితో సంప్రదింపులు కొనసాగిస్తోంది. తొలుత ఏప్రిల్ 14వ తేదీన కేజ్రీవాల్ చేత పాదయాత్ర ప్రారంభింపజేసి.. ఆ తర్వాత రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పాదయాత్రలు కొనసాగించాలన్నది ఆప్ నేతల వ్యూహంగా తెలుస్తోంది. ఇదే జరిగితే.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఆప్ బరిలో నిలిచి చతుర్ముఖ పోటీకి తెరలేపే పరిస్థితి కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి ..

  1. తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్.. రైతు బంధు కట్?
  2. పవన్ కు టీడీపీ సీఎం ఆఫర్!
  3. జీవో 111 రద్దు సాధ్యమేనా? కోర్టులు ఒప్పుకుంటాయా?
  4. రేవంత్ రెడ్డికి సీనియర్ల షాక్! కాంగ్రెస్ లో కల్లోలమేనా…
  5. బీజేపీ పెద్దలతో కోమటిరెడ్డి చర్చలు.. జంపింగ్ ముహుర్తం ఫిక్స్!
  6. యూపీలో బీజేపీని గెలిపించిన ఎంఐఎం.. ఇవిగో లెక్కలు..

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.