
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ కే పరిమితమైన ఎంఐఎం పార్టీ.. ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా పోటీ చేస్తోంది. మహారాష్ట్రలో రోజురోజుకు బలం పెంచుకుంటుంది. అసెంబ్లీలో అడుగుపెట్టింది. బీహార్ లోనూ కొన్ని సీట్లు గెలిచింది. తమిళనాడులోనూ పాగా వేసింది. బెంగాల్ లో పోటీ చేసినా సీట్లు మాత్రం సాధించలేకపోయింది. ఇటీవల జరిగిన ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో వందకు పైగా సీట్ల పతంగి పార్టీ పోటీ చేసింది. యూపీలో జోరుగా ప్రచారం చేశారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ప్రచారంలో భాగంగా ఆయనపై కాల్పుల ఘటన జరగడం దేశ వ్యాప్తంగా సంచలనమైంది. పార్టీ విస్తరణలో భాగంగా దేశమంతా పోటీ చేస్తున్నామని ఎంఐఎం చీఫ్ చెబుతుండగా… బీజేపీకి బీటీమ్ గా మారిందనే విమర్శలు వస్తున్నాయి.ముస్లిం ఓట్లను చీల్చి కమలం పార్టీని గెలిపిస్తుందని అంటున్నారు.
బీహార్ లో బీజేపీ కూటమికి గట్టి పోటీ ఇచ్చింది ఆర్జేడీ. మేజిక్ ఫిగర్ లో 10 సీట్ల ముందే ఆగిపోయింది. అయితే బీహార్ లో చాలా సీట్లలో తక్కువ మెజార్టీతోనే ఆర్జేడీ అభ్యర్థులు ఓడిపోయారు. ముఖ్యంగా ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఆర్జేడీకి ఎంఐఎంతో తీవ్ర నష్టం జరిగింది. దాదాపు 25 నియోజకవర్గాల్లో పతంగికి ఐదు వేల నుంచి 20 వేల ఓట్లు వచ్చాయి. అవన్ని ఆర్జేడీకి పడే ఓట్లే. దీంతో ఎంఐఎం వల్లే బీహార్ లో బీజేపీ కూటమి గెలిచిందని రాజకీయ విశ్లేషకులు తేల్చేశారు. తాజాగా జరిగిన యూపీలోనూ అదే సీన్ కనిపించింది. బీజేపీ వ్యతిరేక ముస్లిం ఓటును ఎంఐఎం చీల్చడం వల్లనే యూపీలో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చిందని అంటున్నారు. యూపీ ఎన్నికల్లో, బీజేపీ200 ఓట్లతో 7 సీట్లు, 500 ఓట్లతో 23 సీట్లు, 1000 ఓట్లతో 49 సీట్లు, 2000 ఓట్ల తేడాతో 86 సీట్లు గెలుచుకుంది. అంటే 165 నియోజక వర్గాల్లో, 200 నుంచి 2000 ఓట్ల తేడాతో విజయం సాధించింది. ఈ అన్ని నియోజక వర్గాలలో ఎంఐఎం పార్టీ, బీజేపీ విక్టరీ మార్జిన్ కంటే ఎక్కువ ఓట్లను సాధించింది.
బిజ్నోర్‌లో ఎస్పీ – ఆర్‌ఎల్‌డీ కూటమికి 95,720 ఓట్లు పోలయ్యాయి, ఎంఐఎంకు 2,290 ఓట్లు వచ్చాయి. ఈ నియోజక వర్గంలో, బీజేపీ అభ్యర్ధి, కేవలం 1,445 ఓట్ల అధిక్యతతో విజయం సాధించారు. నకూర్‌లో బీజేపీకి 1,03,771 ఓట్లు రాగా, ఎస్పీకి 1,03,616 ఓట్లు వచ్చాయి. ఏఐఎంఐఎంకు 3,591 ఓట్లు రావడంతో బీజేపీ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. బారాబంకిలోని కుర్సీ స్థానంలో బీజేపీకి 1,18,614 ఓట్లు రాగా, ఎస్పీకి 1,18,094, ఏఐఎంఐఎంకు 8,541 ఓట్లు వచ్చాయి. సుల్తాన్‌పూర్‌లో బీజేపీ, ఎస్పీల మధ్య ఉన్న వ్యత్యాసం 1388. ఇక్కడ ఎంఐఎంకి 5,251 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ 1647 ఓట్ల అధిక్యతతో విజయం సాధించిన ఔరాయ్ అసెంబ్లీ స్థానంలో ఎంఐఎం 2,190 ఓట్లను చేజిక్కించుకుంది.
షాగంజ్‌లోనూ 76,035 ఓట్లు సాధించిన బీజేపీ విజయం సాధించింది. కానీ, ఈనియోజక వర్గంలో ఎస్పీకి 70,370 ఓట్లు పోలైతే, ఏఐఎంఐఎం 7,070 ఓట్లను చేజిక్కించుకుంది. అంటే ఎస్పీ, ఎంఐఎంకు పోలిన ఓట్లు(70440), ఒకే ఖాతాలో చేరితే, గెలిచిన బీజేపే అభ్యర్ధి కంటే, 1405 ఓట్ల అధిక్యతతో విజయం సాధించేదని విశ్లేషకులు అంటున్నారు. ఇలా ఇంకా అనేక నియోజక వర్గాల్లో ఎంఐఎం అభ్యర్ధులు ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఎంఐఎం, రహస్య మిత్ర పక్షం బీజేపీని గెలిపించిందని, బీజీపీ వ్యతిరేక ముస్లిం ఓట్లను చీల్చి బీజేపీని గెలిపించాలనే కచ్చితమైన లక్ష్యంతో ఏఐఎంఐఎం యూపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి ..
- హిజాబ్ మతాచారం కాదు.. కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు
- ఓ ఎమ్మెల్యేకు కేసీఆర్ 100 కోట్లు మస్కా!
- మహిళలను వేధిస్తున్న తెలంగాణ బీజేపీ నేత!
- కల్వకుర్తిలో దూసుకువస్తున్న యువకేరటం.. ఉప్పల చూపు అసెంబ్లీ వైపు ..?
- బ్రదర్ అనిల్ టార్గెట్ ఏంటీ? బీజేపీ డైరెక్షన్ లో ఉన్నారా?
- ఏపీలో విపక్షాలు ఏకమవుతాయా? పవన్ వెనుక బీజేపీ పెద్దలున్నారా?
3 Comments