
ప్రస్తుతం రాజకీయాలు ఖరీదైపోయాయి. ఎన్నికల్లో పోటీ చేయాలంటే 40- 50 కోట్ల రూపాయలు ఉండాల్సిందే. పార్టీలు కూడా తమ అభ్యర్థులకు కోట్లాది రూపాయలు ఇస్తాయనే ప్రచారం ఉంది. ఇందుకోసం పార్టీలు డొనేషన్ల రూపంలో డబ్బులు సమకూర్చుకుంటాయి. కొన్ని పార్టీల అధినేతలు అభ్యర్థుల నుంచి టికెట్ కోసం డబ్బులు వసూల్ చేస్తాయనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికలొస్తే కేసీఆర్ నుంచి అభ్యర్థులకు పైసల సంచులు వస్తాయని అంటారు. ఒక్కో నియోజకవర్గానికి 20 నుంచి 30 కోట్లు కామన్ అని చెబుతారు. ఇటీవల జరిగిన హుజురాబాద్‌లాంటి బై ఎలక్షన్స్ కు 50 కోట్ల వరకు పంపించారనే ప్రచారం ఉంది.
మరి, కేసీఆర్‌కు అన్నేసి కోట్లకు కోట్ల డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అనే అమాయక ప్రశ్నకు సమాధానం అందరికీ తెలిసిందే. ఆ డబ్బంతా.. అవినీతి అక్రమ సంపాదనేనని అంటారు. తాజాగా, కేసీఆర్ డబ్బును ఎలా సమీకరిస్తారో తెలిపే ఓ ఆసక్తికర సంఘటనను.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. బండి చెప్పిన ఆ విషయం భలే ఇంట్రెస్టింగ్‌గా ఉంది. కేసీఆర్ మార్క్ పాలిటిక్స్‌కు మంచి ఎగ్జాంపుల్‌గా ఉంది. ఆ వివరాలు బండి సంజయ్ మాటల్లోనే…..
“ఓసారి టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్ను కలిసి.. కేసీఆర్ నా దగ్గర వంద కోట్లు తీసుకున్నాడన్నా అని చెప్పాడు. ఆ ఎమ్మెల్యేకు హిందూత్వ భావజాలం ఎక్కువని పార్టీ నుంచి బయటకు పోతాడేమోనని డబ్బు తీసుకున్నాడట” అని బండి సంజయ్ చెప్పారు. “ఆ ఎమ్మెల్యే ఆ డబ్బు మళ్లీ అడుగుతడని.. ఫస్ట్ ఓ మంత్రినో ఇంకెవర్నో ఆ ఎమ్మెల్యే దగ్గరకు కేసీఆర్ పంపిస్తడు. ‘నీ గురించే మాట్లాడుతుండన్నా.. నువ్వు అంత దగ్గరనా అన్నా ఆయనకు?’ అని ఆ వ్యక్తితో చెప్పిస్తడు. ఆ ఎమ్మెల్యేమో.. కేసీఆర్ దృష్టిలో పడ్డానంటే నెక్స్ట్ మంత్రినైత కావొచ్చు అని ఐస్ అయిపోతడు. డబ్బులడిగే సమయానికి ఎవరో వ్యక్తి ద్వారా బ్రేక్ ఫాస్ట్‌కు పిలుస్తాడట. ముఖ్యమంత్రి గారితో బ్రేక్ ఫాస్ట్ అని మళ్లీ ఐస్ అయిపోతడు. మరో ఆరు నెలల తర్వాత కేటీఆరో, వాళ్ల కుటుంబసభ్యులు ఎవరైనా ఆ ఎమ్మెల్యేను కలిసి.. ‘ఏమైంది.. మా నాన్నగారు నా కన్నా ఎక్కువ నిన్నే కలవరిస్తున్నాడు’ అని చెప్పేసరికి ఆ ఎమ్మెల్యే మరో 6 నెలల దాకా డబ్బులు అడగడు. ఇదంతా నాకు ఓ ఎమ్మెల్యే చెప్పిన విషయం. తెలంగాణ ధనిక రాష్ట్రం అనుకున్నాం గానీ మంత్రి పదవికి రూ.100కోట్లు ఇస్తున్నారంటే వ్యక్తులు కూడా ఇంత ధనికులు అనుకోలేదు. టీఆర్ఎస్ పార్టీలో మంత్రులు ఎమ్మెల్యేలకు రూ.100 కోట్లు ఎక్కువ కాదు. అంత డబ్బు వారికి సింపుల్” అంటూ బండి సంజయ్ చెప్పుకొచ్చారు.