
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ ముదురుతోంది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల విజయంతో జోష్ మీదున్న కమలం పార్టీ.. మరింత దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ అధికారులకు వార్నింగ్ ఇచ్చేలా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు బీజేపీ నేతలు.‘‘కేటీఆర్..! కంటోన్మెంట్ మీ అయ్య జాగీరనుకున్నావా? కంటోన్మెంట్‌ను టచ్ చేసి చూడు..! మాడి మసైపోతావ్..! తెలంగాణ ప్రజలు ఉరికిచ్చి.. ఉరికిచ్చి కొడతారు. బలుపెక్కి.. బరితెగించి మాట్లాడితే.. చూస్తూ ఊరుకుంటామా?? ఖబడ్దార్..!’’ అంటూ కేటీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు రోజుల క్రితం అసెంబీలో మాట్లాడిన కేటీఆర్.. కంటోన్మెంట్ లో రోడ్లు ఓపెన్ చేయకపోతే తాము కూడా సీరియస్ యాక్షన్ కు దిగాతమన్నారు. కంటోన్మెంట్ కు కరెంట్, నీళ్లు కట్ చేస్తామని హెచ్చరించారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారత సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అత్యంత దుర్మార్గమని, ఇది ముమ్మాటికీ దేశద్రోహ చర్యేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓల్డ్‌సిటీలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కరెంటుబిల్లులు వసూలు చేయడం చేతకాని దద్దమ్మ.. కంటోన్మెంట్‌కు కరెంటు, నీళ్లు కట్ చేస్తానని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రజలకు, భారత సైన్యానికి క్షమాపణలు చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు.
కంటోన్మెంట్ భూములను కబ్జా చేసి ఫాంహౌస్ లు కట్టుకోవాలనే ఉద్దేశంతోనే కేటీఆర్ ఆ వ్యాఖ్యలు చేసినట్టున్నారని సంజయ్ మండిపడ్డారు. పన్నులు పెంచాలి.. నిధులు మళ్లించాలి.. పేద ప్రజల రక్తం తాగాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లున్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని చూస్తుంటే అనుమానం వస్తోంది. వారందరికీ డీఎన్‌ఏ పరీక్షలు చేయించాలి. ఒకాయనమో చైనాకు.. ఇంకోకాయన పాకిస్తాన్‌కు, ఆఫ్ఘానిస్థాన్‌కు సపోర్టు చేస్తారు. ఉక్రెయిన్-రష్యా వివాదాల్లో.. అక్కడ మన విద్యార్థులు అల్లాడుతుంటే కనీసం స్పందించరు అని సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై బీజేపీ యాక్షన్ ప్లాన్ రూపొందించి, న్యాయపరమైన పోరాటానికి సిద్ధమవుతుందన్నారు.
టీఆర్‌ఎస్ పార్టీకి సాయుధ బలగాలను విమర్శించే చరిత్ర ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ట్విటర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సీఎం కేసీఆర్.. సైన్యం చైనాకు వెన్నుచూపిందంటారు. కేసీఆర్‌తోపాటు.. ఓ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సర్జికల్ స్ట్రైక్స్‌కు ఆధారాలు అడుగుతారు. ఇప్పుడు కంటోన్మెంట్‌కు పవర్, వాటర్ కట్ అంటూ కేటీఆర్ బెదిరిస్తున్నారు’’ అంటూ ఆయన మండిపడ్డారు. ఈ తరహా వ్యాఖ్యలు కేసీఆర్ కు టుంబ అహంకారం, కృతఘ్నతకు నిదర్శనమన్నారు. కంటోన్మెంట్ రోడ్ల విషయం సున్నితమైన అంశమని.. రక్షణ సంస్థలు, భద్రతకు సంబంధించిన విషయమని వివరించారు. కేటీఆర్‌ది దుర్భరమైన వ్యాఖ్య అని విమర్శించారు. ఆ వ్యాఖ్యలు యావత్ రక్షణ సిబ్బందికి అవమానమన్నారు. రక్షణ శాఖ పరిధిలోని కంటోన్మెంట్ ఏమైనా కల్వకుంట్ల జాగీరా? అంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ హెచ్చరించడం సిగ్గుచేటని విమర్శించారు.
ఇవి కూడా చదవండి ..
- కెనడాలో ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
- కేసీఆర్ ఆరోగ్యంపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- తెలంగాణ పోలీస్ శాఖలో కొలువుల జాతర..
- ఇసుక క్వారీలు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు
- కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు చేస్తున్న పోలీసులు .. కేటుగాళ్లపై ఉక్కుపాదం.!
3 Comments