
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావించిన ఐదురాష్ట్రాల ఎన్నికల్లో కాషాయ దళం ప్రభంజనం సృష్టించింది. అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాలను బీజేపీ నిలబెట్టుకుంది. యూపీలో గత చరిత్రలను తీరగరాస్తూ వరుసగా రెండోసారి అధికారం కైవసం చేసుకుంది కమలం పార్టీ. ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి కమలం పార్టీ దూకుడు కనబరిచింది. గట్టి పోటీ ఉంటుందని అందరూ భావించిన యూపీలో కాషాయపార్టీకి ఎదురేలేకుండా పోయింది.
మొదట్నుంచీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచిన అధికార బీజేపీ 260 కి పైగా సీట్లలో విజయం సాధించింది. యూపీలో గెలుపుపై ఎంతో ఆశపెట్టుకున్న ఎస్పీకి నిరాశే మిగిలింది. గతంతో పోల్చితే సీట్లు, ఓట్లను మెరుగుపర్చుకున్నా 130 సీట్లకు మాత్రమే పరిమితమైంది. గతంలో యూపీలో అధికారం చేపట్టిన బీఎస్పీ కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. ప్రియాంక గాంధీ తీవ్రంగా శ్రమించినా కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాల్లో విజయం సాధించింది.
ఎగ్జిట్ పోల్స్ హోరాహోరీ పోటీ ఉంటుందని అంచనావేసిన ఉత్తరాఖండ్ లోనూ కమలం పార్టీ గెలుపు ఏకపక్షమైంది. కాంగ్రెస్ కనీసపోటీ ఇవ్వలేకపోయింది. బీజేపీ 48 సీట్లలో ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం 18 సీట్లకే పరిమితమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత ప్రచారం చేసినా ఖాతా తెరవలేకపోయింది. అయితే బీజేపీ అధికారం దక్కించుకున్నా… సీఎం పుష్కర్ సింగ్ అథామీ పరాజయం పాలయ్యారు. అటు కాంగ్రెస్ సీఎం అభ్యర్థి హరీష్ రావత్ కూడా ఓడిపోయారు.
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్ర సృష్టించింది. ఆప్ ధాటికి సీఎం చన్నీతో పాటు పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్దూ, శిరోమణి అకాలీదల్ అగ్రనేత సుఖ్ బీర్ సింగ్ బాదల్, మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఓటమిపాలయ్యారు. ఆప్ 92 సీట్లలో గెలుపొందగా.. కాంగ్రెస్ కేవలం 18 సీట్లకే పరిమితమైంది. ఇక బీఎస్పీతో పొత్తు పెట్టుకున్న అకాలీదల్ 4 సీట్లలో గెలుపొందగా… అమరీందర్ సింగ్ పార్టీలో జతకట్టిన బీజేపీకి 2 స్థానాలు దక్కాయి. పంజాబ్ లో ఆప్ ఘనవిజయంతో భగవంత్ మాన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
గోవాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్ ఫిగర్ కు ఒక్కసీటు దూరంలో నిలిచిపోయింది. గోవాలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ ఉంటుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. బీజేపీకి 20 సీట్లు దక్కగా.. కాంగ్రెస్ కూటమి 12 స్థానాల్లోనే గెలుపొందింది. ఇక గోవాలో అధికారం దక్కించుకుందామనుకున్న ఆప్ కు నిరాశే మిగిలింది. కేవలం రెండు సీట్లలోనే ఆ పార్టీ అభ్యర్థులు విజయంసాధించారు. ఎంజీపీతో పాటు ఇండిపెండెంట్లు 6 సీట్లను దక్కించుకొని కీలకంగా మారారు.మణిపూర్ లో మరోసారి కమలం వికసించింది. స్పష్టమైన మెజార్టీతో అధికారాన్ని నిలబెట్టుకుంది. కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు బీజేపీకి కనీసపోటీ ఇవ్వలేకపోయాయి. బీజేపీ 32 సీట్లలో గెలుపొందగా.. కాంగ్రెస్ 4 సీట్లకే పరిమితమైంది.
ఇవి కూడా చదవండి …
- కాంగ్రెస్ పార్టీ ఖతమైనట్టేనా? రాహుల్ బాబా భవిష్యత్ ఏంటో?
- కోర్టుల చుట్టు తిరిగి డబ్బు, సమయం వృధా చేసుకోవద్దు- ఎస్సై రామారావు
- కల్తీ పాల ముఠా గుట్టు రట్టు చేసిన ఎల్బీనగర్ ఎస్వోటి పోలీసులు
- ఉద్యోగ భర్తీ ప్రకటనపై నేతల హర్షం.. సీఎంకు కృతజ్ఞతలు
- ఖుష్ మహల్ వద్ద ఖుషీ ఖుషీగా మహిళా దినోత్సవ వేడుకలు
One Comment