
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్: ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం గురించి అందరికీ తెలుసు. ఉక్రెయిన్ దేశంపై రష్యా చేస్తున్న యుద్ధం సరైనది కాదని ఈ సందర్భంగా ప్రపంచ దేశాల నేతలు అంటున్నారు. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపి సంధి చేయగలిగే సామర్థ్యం భారత ప్రధాని నరేంద్ర మోడీకే ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. ‘ఉక్రెయిన్’ సంక్షోభాన్ని కూడా దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతలు ఉపయోగించుకుంటున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తమ ప్రచారానికి కాదేది అనర్హం అన్న రీతిలో కమలం పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే, నిజానికి భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్‌లో ఉండిపోయిన భారతీయులను వెనక్కి రప్పించేందుకుగాను తగు చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర మంత్రులను సైతం విదేశాలకు పంపించి, అవసరమైన చర్యలు త్వరితగతిన తీసుకోవాలని సూచిస్తున్నారు. కాగా, బీజేపీ నాయకులు మాత్రం ఇందుకు భిన్నంగా ప్రచారం చేస్తున్నారు.
రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ఎలా నివారించాలనేది ప్రపంచ నేతలకు అర్థం కావడం లేదని, ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని మోడీ సహకారం కోరుతున్నారని ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ హేమమాలని యూపీ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ ల మధ్య సంధి కుదర్చడం కోసం..మోడీ పని చేస్తున్నారని, మోడీ కృషిని వర్ణించడానికి మాటలు రావడం లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్తున్నారు. మొత్తంగా ‘ఉక్రెయిన్’ నినాదం కూడా బీజేపీ ఎత్తుకుంటున్నది. తన ప్రచారంలో దానిని ఉపయోగించుకుని జోష్ నింపుకునే ప్రయత్నం చేస్తున్నది. అయితే, బీజేపీ ప్రచార సరళిని వ్యతిరేకిస్తూ విపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ జాతీయ భద్రత అంశం తెర మీదకు తీసుకొచ్చి ఎన్నికల్లో లాభం పొందాలని చూస్తున్నదని విమర్శిస్తున్నారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసమే కమలం పార్టీ నేతలు ప్రతి సారి దేశ భద్రత అంశాన్ని గురించి ప్రస్తావిస్తారని ఆరోపిస్తున్నారు. మొత్తంగా బీజేపీకి యూపీ ఎన్నికల్లో ‘ఉక్రెయిన్’ సంక్షోభం కూడా ఓ అస్త్రంగా మారిందనే అభిప్రాయం పలువురు రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..