
క్రైమ్ మిర్రర్, వరంగల్ జిల్లా ప్రతినిధి: వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 145 మంది లబ్దిదారులకు రూ.1, 45,16, 820 విలువైన కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం చేయనన్ని సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు. ఇవాళ కేసీఆర్ పేదింటి యువతులకు మేనమామలా మారారని కొనియాడారు. పేదింటి అమ్మాయిలకు పెండ్లి కోసం రూ. 1,00,116లను తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు.
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు అమలు కావడం లేదన్నారు. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు పరచాలని ఆయా రాష్ట్రాల ప్రజలు వారి ప్రభుత్వాలను కోరుతున్నారని గుర్తు చేశారు. ఒకవైపు కేంద్ర మంత్రులు, అధికారులు రాష్ట్రాన్ని అభినందిస్తున్నారు. మరోవైపు తెలంగాణ బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? ఇదేం విధానం? వాళ్ళవి నాలుకలా? తాటి మట్టలా? అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి ఇంకా దళిత బంధు ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం మన ఊరు మన బడి కార్యక్రమంతో కృషి చేస్తున్నారు. గతంలో ఎన్నో కష్టాలు పడి ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పుడు గ్రామాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూస్తున్నాం అని మంత్రి దయాకర్ రావు స్పష్టం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారం తగ్గిందని తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
One Comment