
క్రైమ్ మిర్రర్, అమరావతి డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం జరగబోతుందని తెలుస్తోంది. కడప మాజీ ఎంపీ, ఏపీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రస్తుత ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం అవినాశ్ రెడ్డి అరెస్ట్ కు సంబంధించిన సమాచారాన్ని పార్లమెంటు సెక్రటరీకి సీబీఐ ఇప్పటికే ఇచ్చినట్లు తెలుస్తోంది.
వివేకానంద రెడ్డిని 2019 మార్చి 15 న పులివెందులలోని ఆయన నివాసంలోనే అత్యంత దారుణంగా హత్య చేశారు. వివేకా హత్య కేసులో తొలి నుంచీ అనేక అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. వైఎస్ అవినాష్ రెడ్డి ప్రమేయంపైన కూడా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. వివేకా హత్య కేసు సీబీఐ చేతికి వెళ్లిన తర్వాత వారు ఒక్కొక్క నిజాన్ని వెలుగులోకి తీస్తూ వచ్చారు. వివేకా కారు డ్రైవర్ అప్రూవర్ గా మారిన తర్వాత కీలక పరిణామాలు జరిగాయి. దస్తగిరి నుంచి, ఆ తర్వాత అప్పటి పులివెందుల సీఐ శంకరయ్య సీబీఐ ముందు ఇచ్చిన వాంగ్మూలాలు అవినాష్ రెడ్డినే నిందితుడనే అనుమానాలు బలపరిచాయి.
Read More : రష్యా వార్ ఆపే ఒక్క మొగాడు మోడీనేనట!
వైఎస్ కుటుంబం నుంచి అవినాష్ రెడ్డి పెదనాన్న వైఎస్ ప్రతాపరెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో కూడా అవినాష్ రెడ్డే వివేకా హత్య వెనుక మాస్టర్ మైండ్ అనే సూచనలు వచ్చాయి. వివేకానందరెడ్డి అంటే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి కుటుంబానికి మొదటి నుంచీ వ్యతిరేకత ఉందనే నిజాన్ని ప్రతాపరెడ్డి వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పారు. దాంతో పాటు 2019 ఎన్నికల ముందు కడప ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డికి ఇవ్వొద్దని, తనకు కాకపోతే వైఎస్ విజయమ్మకో, షర్మిలకో ఇవ్వాలని వివేకానందరెడ్డి గట్టిగా పట్టుబట్టిన వైనం కూడా వైఎస్ ప్రతాపరెడ్డి వాంగ్మూలంలో పేర్కొనడం గమనార్హం.
వివేకానందరెడ్డి హత్య అనంతరం ఘటనా స్థలానికి ముందుగా వెళ్లింది అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అని వివేకా వద్ద టైపిస్టుగా పనిచేసిన ఇనయతుల్లా సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పాడు. దాంతో పాటుగా వివేకానందరెడ్డి గొడ్డలిపోటుతో చనిపోతే.. గుండెపోటుతో మరణించారనే కథను అవినాష్ రెడ్డి అల్లారనే విషయం కూడా సీబీఐ ఎంక్వయిరీలో బయటికి వచ్చింది. అత్యంత దారుణంగా జరిగిన వివేకా హత్యను గుండెపోటు మృతిగా మార్చాలని చూడడం, ఘటనా స్థలంలో నేర ఆనవాళ్లను దగ్గర ఉండి మరీ తుడిపించడం, అప్పటి సీఐ శంకరయ్య ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పిన అంశాలను క్రోడీకరించుకుని అవినాష్ రెడ్డి కుట్ర కోణం ఉందని సీబీఐ ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. దాంతో పాటు తొలి నుంచీ వైఎస్ వివేకానందరరెడ్డి అంటే వ్యతిరేకించడమే కాకుండా తనకు ఎంపీ టికెట్ ఇవ్వద్దని చెప్పి తన రాజకీయ ఎదుగుదలకు వివేకా అడ్డుపడుతున్నారనే ఆక్రోశం కూడా వైఎస్ అవినాష్ రెడ్డిలో ఉందనే నిర్ధారణకు సీబీఐ అధికారులు వచ్చారని, ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ కు రంగం సిద్ధం చేశారని ఢిల్లీ వర్గాల నుంచి విశ్వసనీయంగా అందుతున్న సమాచారం
ఇవి కూడా చదవండి ..
- దొంగతనం కేసులో నిందితుడికి జైలు శిక్ష
- నియంతలకే నియంత..వ్లాదిమిర్ పుతిన్!
- రాజ్యాంగం పనికిరాదని చెప్పిన సీఎంను తొలగించాలి
- రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఎందుకు వచ్చింది?
- ఉక్రెయిన్ ఎయిర్ పోర్టులో కరీంనగర్ స్టూడెంట్ బిక్కుబిక్కు!