
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగింది రష్యా. ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధం జరుగుతున్నా ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది మాత్రం రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గురించే. ప్రపంచలోని అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకరుగా ఉన్న వ్లాదిమిర్ పుతిన్…. ప్రపంచ దేశాలన్ని వారిస్తున్నా లెక్క చేయకుండా ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగి మరోసారి వార్తల్లో నిలిచారు. రెండు దశాబ్దాలకు పైగా రష్యాను ఏలుతున్న వ్లాదిమిర్ పుతిన్ తన తాజా చర్యతో నియంతలకే నియంత అనిపించుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. 2014లో రెఫరెండంతో క్రిమియాను హస్తగతం చేసుకున్న ఆయన.. తాజాగా ఉక్రెయిన్‌పై ఉక్కుపాదం మోపి మరోసారి వార్తల్లోకెక్కారు.
Read More : రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఎందుకు వచ్చింది?
1952లో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జన్మించారు పుతిన్. ఆయన తండ్రి రెండో ప్రపంచ యుద్ధంలో సబ్‌మెరైన్‌లో పనిచేసేవారు. తల్లి ఫ్యాక్టరీలో కార్మికురాలు. 1990 వరకు ఆ దేశ గూఢచార సంస్థ ‘కేజీబీ’లో పనిచేశారు. సోవియన్ యూనియన్ పతనానంతరం రష్యా రాజకీయాల్లోకి ప్రవేశించారు.1999లో బోరిస్ ఎల్సిన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఏడాది పాటు రష్యా ప్రధాన మంత్రిగా పనిచేశారు. 2000లో అధ్యక్ష పదవిని అధిరోహించారు. 2008 వరకు రెండు సార్లు ఈ పదవిలో ఉన్నారు. ఏ నాయకుడూ మూడు పర్యాయాలు వరుసగా అధ్యక్ష పదవిలో కొనసాగరాదన్న రష్యా రాజ్యాంగ నిర్దేశాన్ని అధిగమించడానికి 2008 ఎన్నికల్లో ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. మళ్లీ 2012 ఎన్నికల్లో మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
Read More : ఉక్రెయిన్ ఎయిర్ పోర్టులో కరీంనగర్ స్టూడెంట్ బిక్కుబిక్కు!
మూడోసారి పదవీకాలంలోనే 2014లో ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపట్టి, క్రిమియాను రెఫరెండం సాకుతో రష్యాలో కలిపేసుకున్నారు. 2018 ఎన్నికల్లో నాలుగోసారి మళ్లీ భారీ మెజారిటీతో గెలిచారు. అనంతరం రష్యా అధ్యక్షుడి పదవీకాలంపై పరిమితులను తొలగించేసుకున్నారు. 2036 వరకు తానే అధ్యక్షుడిగా కొనసాగేలా రాజ్యాంగంలో మార్పులు చేసుకొన్నారు.2013- 2016 సమయంలో పుతిన్.. నాలుగు సార్లు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యక్తిగా ఎన్నికయ్యారు. ఎదుటివారిని ఆత్మరక్షణలోకి నెట్టేయడంలో ఆయన దిట్ట. మొదట్లో చెచెన్ వేర్పాటు వాదులను పుతిన్ అణచివేసిన తీరు ప్రజలను ఆకట్టుకుంది.ప్రత్యర్థి రాజకీయపక్షాలతో పాటు తనకు వ్యతిరేక గళం విప్పిన వారిని నిస్సహాయులను చేయగల నేర్పరి. రష్యా ఆర్థికంగా బాగా దెబ్బతిన్నా.. ప్రపంచంలో ఆ దేశ పలుకుబడి ఏమాత్రం తగ్గకుండా చేసిన ఘనత పుతిన్‌కే దక్కుతుంది.
2017 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ జోక్యం చేసుకున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్.. పుతిన్‌ను అస్సలు నమ్మడానికి వీల్లేని వ్యక్తి అని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. కానీ, పుతిన్‌తోపాటు ఈ ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ ఆరోపణలను ఖండించారు. గుర్రపు స్వారీ, మార్షల్ ఆర్ట్స్ చేస్తూ, చేపల వేటలో ఉన్న పుతిన్ ఫొటోలు తరచూ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. పుతిన్ రష్యన్ సామ్రాజ్యాన్ని సృష్టించాలనుకుంటున్నారని, ఉక్రెయిన్‌ను తమ దేశంలో కలిపేయాలని భావిస్తున్నారని అమెరికా సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఇటీవల పేర్కొన్నారు. 2021లో రాసిన ఓ ఆర్టికల్‌లోనూ పుతిన్.. ఉక్రెయిన్‌ను రష్యా ‘మకుటాభరణం’గా అభివర్ణించారు. రష్యా, ఉక్రెయిన్ వేర్వేరు ప్రాంతాలు కావని.. రెండు దేశాల ప్రజలు ఒక్కటేనని తరచూ చెబుతుంటారు. కొన్నాళ్లుగా ఉక్రెయిన్ విషయంలో దూకుడుగా ఉన్న పుతిన్.. ఇటీవల తూర్పు ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలు ప్రత్యేక దేశాలుగా గుర్తించారు. తాజాగా డాన్‌బాస్ ప్రాంతంపై సైనిక చర్యకు ఆదేశిస్తూ.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇతర దేశాలు దీన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తే కనీవినీ ఎరుగని రీతిలో తక్షణమే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు పుతిన్.
ఇవి కూడా చదవండి ..
- వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్ ?
- దొంగతనం కేసులో నిందితుడికి జైలు శిక్ష
- నియంతలకే నియంత.. వ్లాదిమిర్ పుతిన్ !
- రాజ్యాంగం పనికిరాదని చెప్పిన సీఎంను తొలగించాలి
One Comment