
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రష్యా- ఉక్రెయిన్ మధ్య వివాదం 2014 నాటిది. నాడు ఇరు దేశాల సరిహద్దు భాగమైన క్రిమియాను రష్యా ఆక్రమించుకుంది. అప్పటి నుంచి రష్యా మద్దతున్న వేర్పాటువాదులు- ఉక్రెయిన్ బలగాల మధ్య అనేకమార్లు ఘర్షణ చెలరేగింది. ఈ గొడవల్లో దాదాపు 14వేల మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంచనా.అయితే 2020లో ఇరు పక్షాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో పరిస్థితి కొంత చల్లబడింది. కానీ 2021 తొలినాళ్లలో సరిహద్దుల్లో కాల్పుల ఘటనలు మొదలయ్యాయి. అప్పటి నుంచి సరిహద్దుల్లో బలగాల సంఖ్యను పెంచుతూ వస్తోంది రష్యా.
ఉక్రెయిన్ అనేది తూర్పు యూరప్ ప్రాంతంలోని ఒక దేశం. ఇది రష్యా పొరుగునే ఉంటుంది. గతంలో సోవియట్ యూనియన్ లో భాగంగా ఉండేది. యూరప్ లో విస్తీర్ణంపరంగా రష్యా తర్వాత రెండో అతిపెద్ద దేశం ఉక్రెయిన్. దీని జనాభా 4.1 కోట్లు. జనాభాపరంగా యూరప్ లో 8వ అతిపెద్ద దేశం కూడా ఇదే. దీనికి సరిహద్దు దేశాలుగా రష్యా తో పాటు బెలారస్, పోలాండ్, స్లోవేకియా, హంగరీ, రొమేనియా, మాల్డోవా ఉన్నాయి. 1991 ఆగస్టు 24న సోవియట్ యూనియన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది ఉక్రెయిన్. 2014 సంవత్సరం వరకు రష్యాతో ఉక్రెయిన్ స్నేహపూర్వక సంబంధాలు నెరిపింది. 2014లో నాటి ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ చేసిన ఒక ప్రకటన ఆయన ప్రభుత్వం కూలిపోయేలా చేసింది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) తో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం పై సంతకం చేసేది లేదని ఆయన తేల్చి చెప్పడంతో ఇలా జరిగింది.
అదే ఏడాది కొత్త అధ్యక్షుడిగా భారీ మెజారిటీతో గెలిచిన పెట్రో పోరోషేంకోయూరోపియన్ యూనియన్ (ఈయూ) తో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం పై సంతకం చేశారు. ఈ డీల్ వల్ల రష్యాలోని బడా కంపెనీలకు భారీ నష్టం వాటిల్లుతుంది. ఈనేపథ్యంలో కోపగించుకున్న రష్యా ఉక్రెయిన్ బార్డర్ లో 2014 చివర్లో ఆర్మీని దింపింది. ఉక్రెయిన్ లోని క్రిమియా ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. ఈ పరిణామం తో ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఉక్రెయిన్ అమెరికా నేతృత్వంలోని నాటో వైపు చూడటం ప్రారంభించింది. గత ఏడేళ్లలో నాటో, ఉక్రెయిన్ బంధం బాగానే బలోపేతం అయింది.
రష్యా దూకుడుకు చెక్ పెట్టేందుకుగానూ త్వరలో ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం ఇవ్వాలని అమెరికా యోచిస్తోంది. ఇప్పుడు రష్యా ఒక్కసారిగా భారీ సంఖ్యలో ఉక్రెయిన్ బార్డర్ లో ఆర్మీ ని దింపడానికి కారణం ఇదే. ఒకవేళ ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం లభిస్తే.. నాటో సైనిక శిక్షణ కేంద్రాన్ని కేటాయించే అవకాశాలు ఉన్నాయని రష్యా అనుమానిస్తోంది. అలాంటిదేమీ లేదని నాటో చెప్పినా రష్యా నమ్మడం లేదు. అమెరికా రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.“మేం ఎప్పుడూ అమెరికా బార్డర్ కు, బ్రిటన్ బార్డర్ కు వెళ్ళలేదు. కానీ ఆ దేశాలు సభ్యులు గా సైనిక కూటమి “నాటో” మా దేశం సరిహద్దుల్లోకి వస్తుందంటే చూస్తూ ఊరుకోం. మా దేశ రక్షణ కోసం దేనికైనా సిద్ధం. అందుకే ఉక్రెయిన్ సరిహద్దుల్లో సైన్యాన్ని దింపాము. ఉక్రెయిన్ గురించి నాటో మర్చిపోతే మంచిది “ ఇది రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటన.
అమెరికా ఏం అంటోంది ?
రెండు నెలల క్రితం వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్ నుంచి జో బైడెన్, బ్లాక్ సీ తీరపట్టణమైన సోచీలోని నివాసం నుంచి పుతిన్ వీడియో కాల్‌లో మాట్లాడుకున్నారు. నాటో కూటమిలోకి ఉక్రెయిన్‌ను చేర్చుకోవాలనే ఆలోచన మానుకోవాలని..అమెరికా ఈ విషయంపై చట్టబద్ధ హామీ ఇవ్వాలని పుతిన్ కోరారు. ఇరుదేశాల మధ్య చర్చల్లో అణ్వాయుధాల నియంత్రణ పైనా మాట్లాడుకున్నారు. ఉక్రెయిన్ దేశపు సార్వభౌమత్వం, సమగ్రతల్ని దెబ్బతీయాలనే రష్యా దూకుడుకు అంతర్జాతీయ ఆంక్షలతో దీటైన సమాధాన మిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ విషయమై అమెరికా చేస్తున్న హెచ్చరికలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని రష్యాకు చైనా సూచించింది. దూకుడు గా ముందుకు సాగాలని డ్రాగన్ ధైర్యం ఇచ్చింది. ఇటీవల చైనా ప్రభుత్వ మీడియా సంస్థలు, వార్తా పత్రికలలోనూ ఈవిధమైన వరుస కథనాలు ప్రచురితం అయ్యాయి. రష్యా దగ్గర ఉన్న క్షిపణులు, యుద్ధ విమానాల ముందు అమెరికా ఎక్కువ సేపు నిలవలేదు అని చైనా మీడియా వ్యాఖ్యానించింది.
ఇవి కూడా చదవండి ..
- ఉక్రెయిన్ ఎయిర్ పోర్టులో కరీంనగర్ స్టూడెంట్ బిక్కుబిక్కు!
- రష్యా వార్ ఆపే ఒక్క మొగాడు మోడీనేనట!
- రష్యా వార్ తో కొండెక్కిన బంగారం… 51వేలు దాటిన రేట్..
- క్యూ లైన్ పెద్దగా ఉంటోంది.. ఇంకో వైన్‌షాప్ కావాలని మందుబాబుల రిక్వెస్ట్
- మహారాష్ట్ర మంత్రి అరెస్ట్.. కేసీఆరే కారణమా?
6 Comments