
క్రైమ్ మిర్రర్, వరంగల్ ప్రతినిధి: బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు నినాదంతో టీఆర్‌ఎస్ నిరసన దీక్ష చేపట్టింది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యంకాదని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిథులు, నాయకులు ఒక్కరోజు దీక్ష చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షురాలు, ఎంపీ కవిత ఆధ్వర్యంలో బుధవారం టీఆర్ఎస్ నేతలు చేపట్టిన ఈ దీక్షలో ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ మాట్లాడుతూ.. బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధ్యంకాదన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఉక్కు పరిశ్రమ వస్తే ఉద్యోగాలు లభిస్తాయని స్థానిక గిరిజనులు, ఇతరులు ఆశగా ఎదురుచూశారని, వారి ఆశలపై కిషన్‌రెడ్డి నీళ్లు చల్లారని మండిపడ్డారు. బయ్యారంలో నాణ్యమైన ఉక్కు లభిస్తుందని జీఎస్‌ఐ సర్వేచేసి తేలిస్తే, కిషన్‌రెడ్డి అందుకు విరుద్ధంగా మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. నాణ్యమైన ఐరన్ ఓర్ లేనప్పుడు కనీసం పెల్లెట్ల యూనిట్ అయినా ఏర్పాటు చేస్తామని గతంలో కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్ తెలిపారని, అదీ అమలు కాలేదని విమర్శించారు. విభజన చట్టం ప్రకారం ఉక్కు పరిశ్రమను ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు దీక్ష కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు హరిప్రియ నాయక్, శంకర్ నాయక్, రేగా కాంతారావు, రెడ్యానాయక్, ఎమ్మెల్సీ రవీందర్ రావు, జడ్పీ చైర్మన్ బిందు తదితరులు పాల్గొన్నారు.
2 Comments