
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేప్టటిన యాదాద్రిలో పునర్నిర్మితమైన పంచనారసింహుల దివ్యాలయంలో తలపెట్టిన సుదర్శన నరసింహ మహాయాగం వాయిదా పడింది. వచ్చే నెల 21 నుంచి నిర్వహించాలనుకున్న క్రతువును వాయిదా వేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. క్షేత్రాభివృద్ధిలో భాగంగా చేపట్టిన కట్టడాలు పూర్తికానుందనే వాయిదా వేశామని చెప్తున్నారు. అయితే మహాకుంభ సంప్రోక్షణ వాయిదాకు పలు కారణాలు వినిపిస్తున్నాయి. చినజీయర్ స్వామీజీపై కేసీఆర్ రివేంజ్ తీసుకుంటున్నారని అంటున్నారు. మొదటి నుంచి ఆలయ పునర్ నిర్మాణ పనులు చినజీయర్ సూచనల ప్రకారమే జరుగుతున్నాయి. ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ అహ్వానించడానికి ఇష్టం లేకనే వాయిదా వేశారని మరో టాక్ తెరపైకి వచ్చింది.
రామానుజ సహస్రాబ్ది వేడుకలు నిర్వహించిన చినజీయర్ స్వామి, మైహోం అధినేత రామేశ్వరరావుపై సీఎం కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.శ్రీరామానుజ మహా విగ్రహావిష్కరణ శిలాఫలకంలో సీఎం కేసీఆర్ పేరు లేకపోవడంతో ఈ వివాదం మొదలైనట్టు తెలుస్తోంది. సీఎం పేరు లేని విషయంపై సమాచారం అధికార వర్గాల ద్వారా సీఎంవోకు ముందుగానే అందినట్టు సమాచారం. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన కేసీఆర్.. ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా ఉన్నారనే వార్తలు వచ్చాయి. ప్రధాని పర్యటనతోపాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముచ్చింతల్ పర్యటనకు కూడా దూరంగా ఉన్న సీఎం కేసీఆర్.. ముగింపు వేడుకలకు సైతం రాకపోవడంతో ఆయన చినజీయర్‌పై ఆయన ఇంకా ఆగ్రహంతోనే ఉన్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.
మోదీ పాలనపై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఆయనను శ్రీరామచంద్రునితో పోల్చారు చినజీయర్ స్వామి. ఈ విగ్రహావిష్కరణకు మోదీ కన్నా అర్హులు భారతదేశంలో ఎవరూ లేరన్నారు. కేసీఆర్‌కు ఈ పొగడ్తలు మరింత ఆగ్రహం తెప్పించాయని సమాచారం. సీఎం కేసీఆర్ ఆగ్రహాన్ని చల్లార్చేందుకు సువర్ణమూర్తి ఆవిష్కరణ శిలాఫలకంపై ఆయన పేరును కూడా పెట్టారు. దీంతో సీఎం కాస్త చల్లబడి ముగింపు ఉత్సవాలకు హాజరవుతారని భావించారు. శాంతి కల్యాణానికి ఆహ్వానించినా సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు హాజరు కాలేదు. శాంతి కళ్యాణం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందనే చర్చ జరుగుతోంది.
గడిచిన కొద్ది నెలలుగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై యుద్ధం కొనసాగిస్తున్నారు సీఎం కేసీఆర్.ఇన్నాళ్లూ రాజకీయ అంశాలపై సాగిన పోరు కాస్తా ఇప్పుడు ఆథ్యాత్మిక వ్యవహారాలనూ తాకిందని తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న యాదాద్రి ఆలయ పున:ప్రారంభానికి ప్రధాని మోదీ హాజరవుతారా? లేదా? అనేది చర్చనీయాంశమైంది. యాదాద్రి ఆలయ పునర్ ప్రారంభోత్సవానికి రావాలంటూ ప్రధాని మోదీ సహా.. ఇతర ప్రముఖులను సీఎం కేసీఆర్ స్వయంగా గతంలోనే ఆహ్వానించారు. అయితే, ఆలయ పున:ప్రారంభోత్సవానికి సంబంధించి ఆహ్వానపత్రికతో శాస్త్రోక్తంగా వీఐపీలను అధికారికంగా వేడుకకు పిలిచే ప్రక్రియ త్వరలో మొదలుకానుంది. ఈ నేపథ్యంలో మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రధానిని కేసీఆర్ మళ్లీ ఆహ్వానించడం ఇష్టం లేకనే క్రతువును వాయిదా వేశారని అంటున్నారు. మార్చి10 వచ్చే యూపీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ తన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.
ఇవి కూడా చదవండి ..
- కారు నదిలో పడి 9 మంది సజీవ సమాధి
- మేయర్ ప్రమీలా పాండే పై ఎఫ్ఐఆర్ నమోదు
- కేసీఆర్ కు కామ్రెడ్ల షాక్.. కొత్త ఫ్రంట్ అసాధ్యమేనా?
- జగ్గారెడ్డి జగడం ఎందుకు.. రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు?
- సీతక్క ఆవేదన.. జాతర వద్దే ఉన్న మంత్రులు గవర్నర్ రాగానే గాయబ్