
క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజన రచ్చ రాజేస్తోంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తికి ఆజ్యం పోస్తోంది. మంత్రి పదవి ఆశించి భంగపడిన సీనియర్ నాయకులు ఇతరత్రా వివిధ కారణాల చేత అసంతృప్తితో ఉన్న నాయకులకు తమ అసంతృప్తిని వ్యకపరిచేందుకు జిల్లాల విభజన ఒక అవకాశంగా మలుచుకుంటున్నారు. నగరి ఎమ్మెల్యే రోజా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి.. నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాల్లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి గత కొన్ని రోజులుగా నియోజక వర్గంలో పర్యటించిన ఆమె జిల్లాల పునర్విభజనకు సంబంధించి ప్రజాభిపాయాన్ని సేకరించారు. ఇందుకు సంబందించిన నివేదికను సీఎంకు,చీఫ్ సెక్రెటరీకి సమర్పించారు. రోజా మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్నారు. ఆమెకు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి వర్గానికి మధ్య పచ్చ గాడి వేస్తే భగ్గుమనే పరిస్థతి వుంది. ఆమెకు మంత్రి పదవి రాకపోవడానికి అది కూడా కానమని అంటారు. అయితే రోజా ఈ రెండు విషయాల్లో తమ అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు ఈ మార్గాని ఎంచుకున్నారనే చర్చ జరుగుతోంది.
నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అయితే జిల్లాల విభజన అంశాన్ని తమ అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసేందుకు అస్త్రంగా చేసుకున్నారని చెబుతున్నారు. గతంలోనూ తన అసమ్మతిని వ్యక్తం చేసిన ఆనం.. తాజాగా జిల్లాల పునర్విభజన పై అగ్గి మీద గుగ్గిలమే అయ్యారు. జిల్లా విభజన సహేతుకంగా జరగలేదని, రైతులు ఇబ్బంది పడతారని, సాగునీటి ప్రాజెక్ట్ ల వద్ద కొట్లాటలు జరుగుతాయని, ఒక విధంగా రాష్ట్రంలో అంతర్యుద్ధ పరిస్థితులు నెలకొంటాయని అన్నారు. మాజీ మంత్రి మాట్లాడిన తీరు..జగన్ రెడ్డితో ఇక తాడో పేడో తేల్చుకునే రీతిలోనే ఉందని, ఒక రకంగా ఇది అధిష్టానాన్ని ధిక్కరించడమేనని పరిశీలకులు అంటున్నారు.
ఇప్పటికే సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు విషయంలో తప్పటడుగులు వేసి.. తిప్పలు కొని తెచ్చుకున్న నేపధ్యంలో, రామనారాయణ రెడ్డి విషయంలో తొందరపాటు ప్రకటనలు చేయవద్దని, పార్టీ రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకులను హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే ఆనం ఇక వైసీపీలో తనకు రాజకీయ భవిష్యత్ లేదనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. అందుకే ఆయన జంకూ బొంకూ లేకుండా జగన్ నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారని, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అంటున్నారు.నిజానికి ఆనం తనంతట తానూ బయటకు రావడం కాకుండా, తనపై పార్టీ వేటు వేయాలని కోరుకుంటున్నారనే మాట కూడా ఆనం సన్నిహితుల నుంచి వినిపిస్తోంది.
ఇవి కూడా చదవండి ..
- మేడారం జాతరలో అధికారుల పని తీరు భేష్
- మానసిక వికలాంగురాలిపై లైంగిక వేధింపులు
- ఉచిత అంబులెన్స్ సర్వీస్ వాహనాలను ప్రారంభించిన టీపీసీసీ అధ్యక్షులు
- సమతా క్షేత్రానికి విపక్షాలకు ఆహ్వానం ఉండదా!
- మోహన్ బాబుకు ఘోర అవమానం!