
తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగలబోతుందని తెలుస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఝలక్ ఇస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యే అధికార గులాబీ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి కారెక్కడం ఖాయమైందని అంటున్నారు. కొంత కాలంగా పీసీసీ చీఫ్ పై ఆగ్రహంగా ఉన్న జగ్గారెడ్డి.. పార్టీ మారాలని దాదాపుగా నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. శుక్రవారం తన అనుచరులతో ఆయన రహస్య సమావేశం నిర్వహించారని, పార్టీ మార్పుపై వాళ్లతో చర్చించారని తెలుస్తోంది. శనివారం తన అనుచరులతో సమావేశం జరపబోతున్న జగ్గారెడ్డి.. పార్టీ మార్పుపై కీలక ప్రకటన చేస్తారని అంటున్నారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డి మధ్య మొదటి నుంచి విభేదాలున్నాయి. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వొద్దని బహిరంగంగానే ప్రకటనలు చేశారు జగ్గారెడ్డి. రేవంత్ రెడ్డి అనుచరుల ఆ సమయంలో ఆయనను టార్గెట్ చేశారు. దీంతో రేవంత్ సైన్యంపై హైకమాండ్ కు కూడా ఫిర్యాదు చేశారు జగ్గారెడ్డి. రేవంత్ కు పీసీసీ పదవి వచ్చాక కూడా ఇద్దరి మధ్య సఖ్యత కుదరలేదు. సమయం వచ్చినప్పుడల్లా రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టేలా కామెంట్లు చేస్తున్నారు జగ్గారెడ్డి. గురువారం కూడా రేవంత్ కు ఇబ్బంది కలిగేలా వ్యాఖ్యలు చేశారు.
సీఎం కేసీఆర్ బర్త్ డే రోజున నిరుద్యోగుల నిరసన దినంగా రేవంత్ రెడ్డి పిలుపిచ్చారు. అంతేకాదు కేసీఆర్ ను ఊసరవెల్లితో పోల్చుతూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. కాని జగ్గారెడ్డి మాత్రం మీడియా సమావేశం పెట్టి మరీ కేసీఆర్ కు విషెష్ చెప్పారు. కేసీఆర్ బర్త్ డే రోజున నిరసనలు జరపడాన్ని కూడా తప్పుపట్టారు. రేవంత్ రెడ్డి తీరును పరోక్షంగా ఎండగట్టారు. మరోవైపు కొంత కాలంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో జగ్గారెడ్డి టచ్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జగ్గారెడ్డి హ్యాండ్ కు హ్యాండిచ్చి.. కారెక్కాలని దాదాపుగా డిసైడ్ అయ్యారని అంటున్నారు.