
సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ సంగీత దర్శకుడు బప్పీలహిరి కన్నుమూసారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈయన ముంబైలోని బ్రెంచ్ క్యాండీ ప్రైవేట్ హాస్పిటల్లో మరణించారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. కొన్ని రోజుల కింద స్వల్ప కరోనా లక్షణాలతో ఈయన హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. ఆ తర్వాత అదే విషమంగా మారిందని వైద్యులు తెలిపారు. గతంలో కూడా బప్పీ లహరికి కొన్ని అనారోగ్య సమస్యలున్నాయి.
ఎనర్జిటిక్ సాంగ్స్‌కు పెట్టింది పేరు బప్పీ లహరి. ఆయన పాట వస్తుందంటే.. దేశమంతా ఊలాలా ఊలాలా అంటూ ఊగిపోవాల్సిందే. ఓ పాటను కంపోజ్ చేసినా.. తాను పాడినా.. ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తుండేవారు బప్పీ దా. అందుకే ఆయనకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చివరగా తెలుగులో 2020లో రవితేజ హీరోగా నటించిన డిస్కో రాజా సినిమాలో టైటిల్ సాంగ్ పాడారు. రమ్ పమ్ పమ్ అంటూ అదిరిపోయే రాక్ స్టైల్‌లో ఈ పాటను పాడారు బప్పీ లహరి. డిస్కో డాన్సర్, హిమ్మత్ వాలా, షరాబీ లాంటి సినిమాలకు బప్పీ అందించిన సంగీతం నేటికి నిత్య నూతనమే.
తెలుగు ఇండస్ట్రీతో కూడా ప్రత్యేక అనుబంధం ఉండేది ఈయనకు. హిందీలో బప్పీ లహరి పాటలకు పిచ్చెక్కిపోతుంటారు ఫ్యాన్స్. సింహాసనం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు బప్పీ. అందులో ఆకాశంలో ఒక తార అనే పాట ఇప్పటికీ పాడుకుంటారు ఫ్యాన్స్. ఆ తర్వాత చిరంజీవితో చేసిన గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్, స్టేట్ రౌడీ పాటలు సూపర్ హిట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా 70, 80, 90వ దశకాల్లో ఎన్నో సంచలన సినిమాలకు సంగీతం అందించారు బప్పీ లహరి. తెలుగులోనూ ఈయన సూపర్ పాపులర్. సింహాసనం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బప్పీ.. ఆ తర్వాత చాలా సినిమాలకు సంగీతం అందించారు. చిరంజీవి సినిమాలకు బప్పీ లహరి అందించిన పాటలు ఇప్పటికీ గుర్తున్నాయి. ఈయన చివరగా 2020లో వచ్చిన భాగి 3లో ఓ పాట పాడారు. ఈయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు సినీ ప్రముఖులు.