
హైదరాబాద్ లో మరోసారి గ్యాంగ్ వార్ జరిగింది. రహస్యంగా పేకాట స్థావరాలు నిర్వహిస్తున్న రెండు వర్గాలు కళ్లల్లో కారంపొడి చల్లుకొని కర్రలు, రాడ్లతో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. సినిమా ఫక్కీలో జరిగిన పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్నేహితుడి డబ్బు వసూలు విషయంలో కలుగజేసుకున్న యువకుడు ప్రత్యర్థులతో గొడవకు దిగి.. తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
షాపూర్‌నగర్ ప్రాంతానికి చెందిన చేపల రాము, జీడిమెట్ల రామిరెడ్డినగర్‌కు చెందిన మణికంఠ కొంతకాలంగా నగర శివార్లలో వేర్వేరుగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా వీరిమధ్య అంతర్గత పోరు నడుస్తోంది. గతంలో తనవద్ద పనిచేసిన రమేష్‌కు రాము కొంత డబ్బు బాకీ పడినట్లు తెలిసింది. ఆ డబ్బు వసూలు విషయంలో రాముకు, రమేష్‌కు గొడవ జరిగింది. దాంతో తన డబ్బులు ఎలాగైనా వసూలు చేసుకోవాలని భావించిన రమేష్ ఈ విషయాన్ని తన స్నేహితుడు మణికంఠకు చెప్పాడు. దీంతో మణికంఠ ఫోన్‌చేసి తన స్నేహితుడికి ఇవ్వాల్సిన డబ్బులు వెంటనే ఇచ్చేయాలని రామును హెచ్చరించారు.ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. డీపీఆర్ స్కూల్ వద్దకు రావాలంటూ మణికంఠకు రాము సవాల్ విసిరాడు. మణికంఠ తన అనుచరులతో స్కూల్ వద్దకు వెళ్లగా.. అప్పటికే దాదాపు 20మందితో కాపుకాచి ఉన్న రాము, ఒక్కసారిగా వారిపై విరుచుకుపడ్డారు.
కళ్లల్లో కారం చల్లి కర్రలు, రాడ్లు వంటి మారణాయుధాలతో దాడికి పాల్పడ్డాడు. మణికంఠ గ్యాంగ్‌కూడా వారిపై ఎదురు దాడిచేసింది. ఈ గొడవలో తీవ్రంగా గాయపడిన మణికంఠ రక్తపుమడుగులో పడిపోయాడు. మరో వ్యక్తి శ్రీహరిరాజు తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇరు వర్గాల మధ్య జరుగుతున్న గ్యాంగ్ వార్‌ను గుర్తించిన స్థానికులు పోలీసులకు, 108 సిబ్బందికి ఫోన్ చేశారు. క్షతగాత్రులను హుటాహుటిన సూరారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మణికంఠ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బాధితుడు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేట్‌బషీరాబాద్ పోలీసులు తెలిపారు