
ఆ ఇంట్లో బర్త్ డే వేడుకలు జరుగుతున్నాయి. అందరూ సంతోషంగా ఉన్నారు. తన ముద్దు ముద్దు మాటలతో ఇంట్లోవాళ్లకు సంతోషాన్ని పంచింది రెండేళ్ల చిన్నారి. అయితే అంతలోనే విషాదం చోటు చేసుకుంది. పొరపాటున వేడివేడి సాంబార్ గిన్నెలో పడి ప్రాణాలు కోల్పోయింది రెండేళ్ల చిన్నారి. కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలంలో జరిగిందీ ఘటన. ముద్దు ముద్దు మాటలతో ఇంట్లోవాళ్లకు సంతోషాన్ని పంచిన చిన్నారి.. అంతలోనే అందరినీ విషాదంలో ముంచింది. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. తల్లి చేతి గోరుముద్దలు తింటూ సరదాగా ఆడుకుంటూ పొరపాటున సాంబర్ గిన్నెలో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది.
కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలంలోని కలగర ఎస్సీ వాడకు చెందిన కారుమంచి శివ, బన్ను దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో తేజశ్విని(2) గత ఏడాది కాలంగా సత్తుపల్లిలోని అమ్మమ్మ వద్ద ఉంటోంది. శివ సోదరుడు రవికి ముగ్గురు కుమార్తెలు. వీరిలో పెద్దకుమార్తె పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. శివ ఊరెళ్లి తేజశ్వినిని కూడా తీసుకొచ్చాడు. రోజంతా తన అమ్మానాన్నలతో పాటు, అక్కలు, పెద్దమ్మ, పెదనాన్న, నానమ్మ, తాతలతో కలసి తీయని అనుభూతులు పంచుకుంది. వచ్చీరాని మాటలతో సందడి చేసింది. కాగా,
ఈ క్రమంలో ఆదివారం రాత్రి తల్లి బన్ను చేతిలో గోరుముద్దలు తింటూ ఆటలాడుకుంటున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లో పిల్లలందరికీ కలిపి అన్నం తినిపిస్తున్న తల్లి.. ఒక్క క్షణం పక్కకు వెళ్లొచ్చేలోపే విషాదం జరిగింది. ఆటలాడుకుంటున్న తేజశ్విని.. అప్పుడే కాచిన వేడి సాంబారు గిన్నె వద్ద సంచరిస్తూ వచ్చీ రాని నడకతో తూలిపడింది. సాంబార్ గిన్నెపై సగం తెరిచిన మూతపై చేతులు పెట్టగానే కాలి.. పట్టుజారి గిన్నెలో పడిపోయింది.