
బీజేపీ, టీఆర్ఎస్ మధ్య కొంత కాలంగా సాగుతున్న ఉద్యమం పీక్ స్టేజీకి చేరిందా? తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి. బీజేపీ ముఖ్యమంత్రిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీకి చెందిన అస్సాం సీఎం పై హైదరాబాద్ లో కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీజేపీ మఖ్యమంత్రి హేమంత్ బిశ్వశర్మపై కేసు నమోదైంది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీజేపీ ముఖ్యమంత్రిపై మూడు సెక్షన్ ల పైన కేసు నమోదైంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అసోంపై సీఎం కేసీఆర్ ఓ రేంజ్ లో ఫైరయ్యారు. బీజేపీకి చిత్తశుద్ది ఉంటే అతన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదేనా బీజేపీ సంస్కారం అంటూ మండిపడ్డారు. అసోం సీఎం విషయంలో ప్రధాన మోడీని టార్గెట్ చేశారు కేసీఆర్. రాహుల్ కు మద్దతుగా బీజేపీ సీఎంను కేసీఆర్ టార్గెట్ చేయడం దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.
ఇక సంస్కారాన్ని మర్చిపోయి రాహుల్ గాంధీపై అభ్యంతరకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై కాంగ్రెస్ నేతలు రాష్ట్ర వ్యాప్యంగా ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని 709 పోలీస్ స్టేషన్‌లలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఫిర్యాదులు చేశారు. అస్సాం ముఖ్యమంత్రిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హిమంత బిశ్వ శర్మ మొత్తం మహిళాలోకాన్ని కించపర్చేలా మాట్లాడారని, రాజ్యాంగబద్దమైన పదవిలో ఉంటూ మహిళా జాతినే కించపర్చేలా రాహుల్‌గాంధీ జన్మ గురించి వ్యాఖ్యలు చేసిన హిమంత్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
అంతేకాదు రాహుల్ పై కామెంట్ల విషయంలో బీజేపీపై విమర్శలు చేసిన కేసీఆర్.. తన చిత్తశుద్ది నిరూపించుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. మాటలు కాదు చేతల్లో చూపించాలని, తాము చేసిన ఫిర్యాదులపై విచారణ జరిపి హిమంత బిశ్వ శర్మపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తాజా అసోంపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు బీజేపీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. తర్వాత ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. అసోం సీఎంను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేస్తారా అన్నది చర్చగా మారింది.
2 Comments