
దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్… మోడీ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు. తీవ్రమైన ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. బీజేపీని దేశం నుంచి తరిమికొడతామని హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ కోటలు బద్దలు కొడతామంటూ ప్రకటనలు చేస్తున్నారు. దీంతో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారని కనిపిస్తోంది. అందులో భాగంగానే సోమవారం మరో కీలక పరిణామం జరిగింది. పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.. తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. వీరిద్దరూ దేశ రాజకీయలపై చర్చించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా కలిసికట్టుగా పనిచేయాలని సీఎం కేసీఆర్ కు ఆమె పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.
భవిష్యత్తు రాజకీయాల్లో కలిసికట్టుగా పనిచేసేందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించినట్లు సమచారం. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని ఈ సందర్భంగా మమతా బెనర్జీ స్పష్టం చేశారు. అనేక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. మార్చి 3వ తేదీన వారణాసిలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. అయితే ఈ క్రమంలో తమ టీఎంసీ పార్టీ జాతీయ పార్టీలతో సన్నిహితంగా లేదని దీదీ తేల్చి చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫెడరల్ ఫ్రంట్ సహకారం అవసరమని తెలిపారు. ఇదే విషయమై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తోనూ మాట్లాడినట్లు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
మార్చిలో మమతా బెనర్జీ, స్టాలిన్, కేసీఆర్ సమావేశం అవుతారని తెలుస్తోంది. వీళ్లు మరికొందరు ప్రాంతీయ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. శరద్ పవార్, ఉద్దవ్ థాకరే, నవీన్ పట్నాయక్, తేజస్వి యాదవ్ తో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కేసీఆర్ టీమ్ కలవనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రాంతీయ పార్టీలను బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏకం చేసే ప్రయత్నాలు జరుగుతుండగా.. బలమైన పార్టీలకు అధ్యక్షులుగా ఉన్న ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు పేర్లు మాత్రం వినిపించడం లేదు. వీళ్లిద్దరు ఏ కూటమిలో ఉంటారన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. దీంతో బీజేపీ వ్యతిరేక కూటమిలో ఈ రెండు పార్టీలు చేరకపోవచ్చని భావిస్తున్నారు. అందుకే చంద్రబాబు, జగన్ తో మమతా మాట్లాడలేదని అంటున్నారు. గత 2019 ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక కూటమిలతో యాక్టివ్ రోల్ పోషించారు చంద్రబాబు. ఎన్నికల తర్వాత రూట్ మార్చారు. బీజేపీకి మద్దతు ఇవ్వకపోయినా.. ఆ పార్టీకి వ్యతిరేకంగా మాత్రం ఎక్కడా మాట్లాడటం లేదు.