Telangana

మేడారం జాతరలో నిలువు దోపిడీ! అధికారులకు వాటా?

క్రైమ్ మిర్రర్, ములుగు ప్రతినిది : ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహా మేడారం జాతరకు సర్వం సిద్దమైంది. ఫిబ్రవరి 16-19 వరకు నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. 16 రోజున సారక్క గద్దె మీదికి వస్తుండగా, 17న సమ్మక్కను తీసుకొస్తారు. 18న అమ్మవార్లు ప్రజలందరికీ దర్శనమిచ్చి 19న మళ్లీ వనాల బాట పడతారు. హైదరాబాద్ లాంటి మహా నగరవాసులు కూడా ప్రతి రెండేళ్లకోసారి మేడారానికి క్యూ కడతారు. పేరుకు అతిపెద్ద గిరిజన కుంభమేళాగా చెబుతారే కానీ… మైదాన ప్రాంత, గిరిజనేతర ప్రజలతో అటవీ ప్రాంతమంతా కిక్కిరిసిపోతుంది. జాతరకు 20 రోజుల ముందు నుంచే భక్తుల పుణ్యస్నానాలు, శివసత్తుల పూనకాలతో జంపన్నవాగు పునీతమవుతుంది. ప్రతి జాతరకూ జనం పెరుగుతున్నారే తప్ప ఎక్కడా తగ్గింది లేదు. జాతర ముగిసేలోపు దాదాపు 3 కోట్ల మంది భక్తులు దర్శించుకునే జనజాతరగా మేడారాన్ని చెబుతారు.

మొన్న జనవరి 26 రోజున సెలవు కావడం చేత దాదాపు 5 లక్షల భక్తులు హాజరయ్యారు. మాఘశుద్ధ పూర్ణిమ సమీపిస్తున్న దృష్ట్యా క్రమంగా భక్తుల సంఖ్య ఇంకా పెరుగుతోంది. జనవరి 30 ఆదివారం ఉండడంతో ఈ సంఖ్య 10 లక్షలు తాకే అవకాశం ఉందంటున్నారు. జాతర ఆ తరువాత ఇప్పుడు ప్రతిరోజూ తగ్గే అవకాశం కూడా లేదు. సమ్మక్క-సారక్క జాతరకు పెరుగుతున్న ఆదరణ కారణంగానే ఏటేటా ప్రభుత్వం నిధుల కేటాయింపు పెంచుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈసారి జాతరకు తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఏర్పాట్లు, సౌకర్యాల కోసం రూ. 75 కోట్లు కేటాయించింది.

ఇక జనం ఎక్కడ చేరతారో అది ప్రముఖ వ్యాపార కేంద్రంగా మారడం సహజమే. దీన్నో అవకాశంగా తీసుకున్న వ్యాపార వర్గాలు అక్కడికి అన్ని రకాల వస్తువులు, తినుబండారాలు తరలించి రూపాయి పెట్టుబడికి 10 రెట్లు లాభాలు ఆర్జించేలా రేట్లు పెంచుతున్నారు. దీంతో ఖరీదైన భక్తుల సంగతి పక్కనపెట్టి.. కేవలం అమ్మవార్లను దర్శించుకొని వెళ్దాం అని వచ్చే సామాన్య భక్తులు, నిజాయతీగా మొక్కులు తీర్చుకుందామనుకునే పేదల చేతి చమురు విపరీతంగా వదులుకోవాల్సి వస్తోంది. ఫలితంగా ఏ మొక్కులూ మొక్కుకోనివారు సైతం వ్యాపారస్తుల లాభాపేక్ష కారణంగా దేవతల ముందు నిలువు దోపిడీకి గురికావాల్సి వస్తోంది.

ధరల్లో స్థానిక వ్యాపారులు ఒకరకంగా, స్థానికేతర వ్యాపారులు ఒకరకంగా రేట్లు ఫాలో అవుతున్నారు. బ్రాయిలర్ కోడి కిలో ప్రస్తుతం రూ. 180-200 నడుస్తోంది. అయితే ఇలాంటి అంశాల్లో స్థానిక వ్యాపారులు మార్కెట్ రేట్లు అనుసరిస్తుండగా స్థానికేతర వ్యాపారులు మాత్రం వీరు పెట్టిందే రేటు అమ్మిందే వస్తువు అన్నట్టుగా తయారైంది. ఇక నాటుకోడి విషయానికొస్తే కిలో రూ. 500 – 650 వరకు నడుస్తోంది. మద్యం రేట్లు ఆకాశానికంటాయి. ప్రతి క్వాటర్ బాటిల్ మీద రూ. 50-80 కి పెంచి అమ్ముతున్నారు. బయట రూ. 300 ఉండే బ్లెండర్ స్ప్రైడ్ క్వాటర్ ఇక్కడ రూ. 380 అమ్ముతున్నారు. ఇక బీర్లయితే అక్షరాలా డబుల్ రేట్లకు అమ్ముతున్నారు. గుడి ముందు వేలంపాటలో దుకాణాలు దక్కించుకున్నవారు పూజాసామగ్రి సెట్లను రూ. 150కి అమ్ముతున్నట్టు భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ ప్యాకేజీలో రెండు కొబ్బరికాయలు, రెండు బంగారం కడ్డీలు (చిన్నసైజు బెల్లం ముక్కలు), 4 అగరువత్తులు, పసుపు-కుంకు ప్యాకెట్లు 2 చిన్నవి. దాదాపు రూ. 60 విలువ చేసే ఈ వస్తువులకు రూ. 150 వసూలు చేస్తున్నారు. అయితే తాము రూ. 10 వేలు చెల్లించి వేలంలో షాపులు దక్కించుకున్నామని, అందువల్ల తాము కూడా ఎక్కడి నుంచో ఎన్నో కష్టనష్టాలకోర్చి వస్తున్నాం కాబట్టి ఎంతోకొంత లాభం చూసుకోవాల్సిందే కదాని సర్ది చెబుతున్నారు.

ఇక మేడారంలో రోడ్ల వెంట పొలాల్లో షాపులు పెట్టుకోవడానికి స్థానికేతర వ్యాపారులు చిన్నచిన్న గుడారాలు వేసుకునేందుకు ఆయా భూముల యజమానులకు పెద్దమొత్తంలో డబ్బు చెల్లించాల్సి వస్తోంది. 3-5 గజాల స్థలానికి ఈ జాతర జరిగే దాదాపు 20 రోజులకు దాదాపు రూ. 25 వేలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఆ గుడారాల్లో పెట్టుకునే షాపులన్నీ తమ వస్తు, సేవలకు విపరీతంగా రేట్లు పెంచి సొమ్ము చేసుకుంటున్నాయి. ఇక ఇవే ధరలు గుడి సమీపంలో అయితే గజానికి రూ. 5 వేల నుంచి రూ. 10 వేలు నడుస్తున్నట్టు పలువురు వ్యాపారులు చెబుతున్నారు. అమ్మవార్ల దర్శనార్థం వచ్చే సామాన్య భక్తులు మరీ ఇక్కట్ల పాలు కాకుండా ధరల్ని నియంత్రించాల్సిన అధికారులకు కూడా ఈ దందాలో వాటా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి ..

  1. అధికారులపై కోర్టుకెక్కి పెన్షన్ సాధించిన అవ్వ
  2. టీఆర్ఎస్ నేత దారుణ హత్య… తల, మొండెం వేరు చేసిన కిరాతకులు
  3. బీజేపీకి షాకేనా.. కాంగ్రెస్ గల్లంతేనా? ఐదు రాష్ట్రాలపై లేటెస్ట్ సర్వే..
  4. కరీంనగర్ లో కారు బీభత్సం.. గుడిసెలో నిద్రిస్తున్న నలుగురు దుర్మరణం

WhatsApp Image 2021 06 19 at 4.16.03 PM - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.