
జిల్లాల విభజన ఆంధ్రప్రదేశ్ లో వివాదాలకు కారణమవుతోంది. దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ ఏదో ఒక ఆందోళన జరుగుతోంది. జిల్లా పేరు మార్చాలని కొన్ని చోట్ల, జిల్లా కేంద్రంగా తమ ప్రాంతమే ఉండాలని మరికొన్నిచోట్ల నిరసనలు జరుగుతున్నాయి. రెవిన్యూ డివిజన్ల కోసం ఉద్యమాలు సాగుతున్నాయి. తమ ప్రాంతాన్ని ఆ జిల్లాలో కలపవద్దు… ఈ జిల్లాలో కలపాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక గోదావరి జిల్లాల్లో విభజన మంటలు తీవ్రంగా ఉన్నాయని అంటున్నారు. భీమవరం ప్రజలు గెలిచారు.. నరసాపురం ప్రజలు ఓడిపోయారు అంటూ వైసీపీ మాజీ నేత చేసిన కామెంట్ కలకలం రేపుతోంది. ప్రభుత్వం ఓ కులాన్ని, ఓ ప్రాంతాన్ని వెనకేసుకొస్తోందంటూ చేసిన వ్యాఖ్యలు చిచ్చు రాజేస్తున్నాయి.
భీమవరం జిల్లా కేంద్రంగా కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య సంచలన ప్రకటన చేశారు. కొత్తజిల్లాల ఏర్పాటులో భీమవరం వైసీపీ నేతలు, ప్రజలు విజయం సాధించారని అన్నారు. నరసాపురం వైసీపీ నేతలు, ప్రజలు ఓడిపోయారని చెప్పారు. ఈ ఒక్క నిర్ణయం చాలు ప్రభుత్వం ఏ ప్రాంతాన్ని, ఏ కులాన్ని వెనకేసుకొస్తుందో తెలియడానికి అని హరిరామజోగయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాను ఏలూరు కేంద్రంగా ఏలూరు జిల్లా, భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఏలూరు జిల్లాలో ఏలూరు, దెందులూరు, పోలవరం, చింతలపూడి, ఉంగుటూరు పాత నియోజకవర్గాలతో పాటు కొత్తగా కృష్ణా జిల్లా పరిధిలోని నూజివీడు, కైకలూరులను ఇందులో విలీనం చేయనున్నారు. దాదాపు ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలను ఒకటిగా చేసి కొత్త జిల్లాకు రూపకల్పన చేశారు.
భీమవరం జిల్లాలో నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను చేరుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. నరసాపురం, ఉండి, భీమవరం, పాలకొల్లు, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజక వర్గాలు ఉంటాయి. రాజకీయంగా, రైతుల పరంగా, మార్కెట్ పరంగా.. భీమవరం జిల్లా ప్రాంతమంతా బాగా అభివృద్ధి చెందింది. తాడేపల్లిగూడెం విద్యా, వాణిజ్య రంగాల్లో దూసుకు పోతుండగా.. భీమవరం ఆంధ్రా లాస్‌వెగాస్‌గా, ఆక్వా సెంటర్‌గా పేరు గాంచింది. ఇలా డెవలప్ అయిన ప్రాంతమంతా ఒక జిల్లాగా మారిస్తే.. మిగతా వెనకబడిన ప్రాంతాలు మరింత వెనకబడతాయని అంటున్నారు.
భీమవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు రాజకీయ కుట్రేనని.. నరసాపురాన్నే జిల్లా కేంద్రంగా ఉంచాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల.. ఇప్పుడు ప్రతిపాదిత రాజమహేంద్రవరం జిల్లాలో చేరింది. వాస్తవానికి ద్వారకా తిరుమల ఏలూరుకు 40 కిలోమీటర్ల సమీపాన ఉండగా, రాజమహేంద్రవరానికి 75 కిలోమీటర్ల దూరాన ఉంది. ఏలూరు జిల్లాలో చేరనున్న కృష్ణా జిల్లా ఆగిరిపల్లి.. విజయవాడకు చేరువలో ఉంటుంది. కానీ, నూజివీడు నియోజకవర్గాన్ని ఏలూరు జిల్లాలో విలీనం చేయడం వల్ల దాదాపు 60 కిలోమీటర్లు ప్రయాణ భారం పెరగుతుంది. సరైన కసరత్తు లేకుండానే హడావుడిగా జిల్లాలను విభజించడంపై స్థానికులు, వివిధ రాజకీయ, సామాజిక వర్గాలు మండిపడుతున్నాయి.
తూర్పు గోదావరి జిల్లాను సైతం ఎటూ కాకుండా చేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేయబోయే కోనసీమ జిల్లాలో.. కోనసీమేతర నియోజకవర్గాలైన రామచంద్రపురం, మండపేటలను చేర్చారు. దీనిపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ప్రాంతవాసులకు కోనసీమ జిల్లా కంటే కాకినాడ జిల్లా దగ్గరగా ఉంటుంది. కాజులూరు మండలం కాకినాడకు 22 కిలోమీటర్లు. అదే కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురానికి 50 కిలోమీటర్లు. మండపేట నియోజకవర్గం అమలాపురం పార్లమెంట్ స్థానంలో ఉంది. దీంతో ఈ నియోజకవర్గంలో మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను కోనసీమ జిల్లాలో కలుపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై నిరసన వ్యక్తం అవుతోంది.
అనపర్తి నియోజకవర్గం పరిధిలోని పెదపూడి మండలం కాకినాడకు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ అనపర్తి నియోజకవర్గం రాజమహేంద్రవరం పార్లమెంట్ స్థానం పరిధిలో ఉన్నందున రాజమహేంద్రవరం జిల్లాలో ప్రభుత్వం కలిపింది. దీనిని కాకినాడ జిల్లాలో కలపాలని డిమాండ్ వస్తోంది. జిల్లాలోని రంచోడవరం, ఎటపాక రెవెన్యూ డివిజన్ల పరిధిలోని మొత్తం మండలాలను విశాఖ జిల్లా పరిధిలోని పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలుపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని వల్ల 250 కిలోమీటర్లకుపైగా దూరం ఉన్న పాడేరు వెళ్లడం అసాధ్యమని ఆదివాసీ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. బదులుగా రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ప్రకటించాలని కోరుతున్నాయి.