
- ఎమ్మార్పీ కంటే ఎక్కువకు మద్యం విక్రయాలు
- హోల్ సేల్ దుకాణాలంటూ సరికొత్త దందా
- నీటి మీద గీతల్లా ప్రభుత్వ నిబంధనలు
- చోద్యం చూస్తున్న ఆబ్కారీ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, షాద్ నగర్ : షాద్ నగర్ పట్టణంలో మద్యం వ్యాపారులు డబ్బు కోసం బరితెగింరు.. వైన్ షాప్ లు దక్కించుకున్న వారంతా సిండికేట్ గా ఏర్పడి యథేచ్ఛగా ప్రజలను దోచేసేస్తున్నారు. తమ సిండి’కేటు’ తెలివితో వందల సంఖ్యలో బెల్టు దుకాణాలను తెరిపించి సరి కొత్త దందాకు తెరలేపారు. హోల్ సేల్, రిటైల్ అంటూ మద్యం వ్యాపారుల రింగ్ తమదైన అక్రమ వ్యాపార ముద్ర వేస్తున్నా అధికారగణం మాత్రం కిమ్మనడం లేదు. అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ సిండి’కేటు గాళ్ళు’ చేస్తున్న దందా ఇది.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ప్రభుత్వం 14 వైన్ షాప్ లకు అనుమతి నిచ్చింది. ఆయా మద్యం దుకాణాలను ప్రభుత్వ టెండర్లలో పాల్గొని మద్యం అమ్మకాలు చేసేందుకు ఎవరికి వారు ప్రత్యేకంగా లైసెన్స్ లు దక్కించుకుని వ్యాపారం ప్రారంభించారు. ఇదంతా బాగానే ఉన్నా ఇక ఇక్కడే అసలు కథ ప్రారంభమైంది. సదరు మద్యం షాప్ యజమానులు మద్యం ప్రియులను దోచుకునేందుకు అంతా సిడికేటుగా ఏర్పడి పక్కాగా ప్లాన్ చేశారు. ప్లాన్ కు అనుగుణంగానే ఎలాంటి అనుమతులు లేకుండా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి హోల్ సేల్ వ్యాపారమంటూ అధిక ధరలకు మద్యం విక్రయాలు చేస్తున్నారు.
బెల్టు దుకాణాలకు హోల్ సేల్ ధర…
పట్టణంలో ఉన్న 14 మద్యం దుకాణాల యజమానులంతా ఒక్కతాటిపైకి వచ్చి సిండికేట్ గా మారారు. ఫరూక్ నగర్ మండలంలోని పలు గ్రామాల నుండి పట్టణానికి వచ్చే బెల్టు షాపుల వారికి అనుకూలంగా వుండే విదంగా మద్యం సిండికేట్ పట్టణంలో ని పరిగి రోడ్డు, మహబూబ్ నగర్ రోడ్డు లోని ఏ బి కాంప్లెక్స్, కమ్మదనం రోడ్డు, బుచ్చిగుడ రోడ్డు లలో ఉన్న మద్యం దుకాణాల్లో ప్రత్యేకంగా హోల్ సేల్ కౌంటర్ లను ఏర్పాటు చేశారు. గ్రామాల నుండి వచ్చే బెల్టు షాపుల నిర్వాహకులకు కేవలం ఆయా హోల్ సేల్ మద్యం దుకానంలోనే మద్యాన్ని విక్రయిస్తారు. అదీ ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మాత్రమే. మిగతా 14 దుకాణాల్లో బెల్టు షాపుల నిర్వాహకులకు మద్యం అమ్మకాలు చేయరు. ఎందుకంటే అవి రిటైల్ అమ్మకాలు చేసే దుకాణాలని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
ఇలా ప్రత్యేకంగా పట్టణం చుట్టూ 4 మద్యం హోల్ సేల్ కౌంటర్ లను ఏర్పాటు చేసి అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం గమనార్హం. ఫరూక్ నగర్ మండలంలో మొత్తం 48 గ్రామ పంచాయితీలు ఉండగా ప్రతి గ్రామంలో పదికి పైగా బెల్టు దుకాణాలు దర్శనమిస్తాయి. ఈ బెల్టు షాపులు నిర్వహించే వారి లిస్ట్ అంతా ఈ మద్యం వ్యాపారుల సిండికేట్ వద్ద ఉంటుంది. ఒకవేళ బెల్టు షాపుల నిర్వాహకులు ఇతర ప్రాంతాల నుండి మద్యం తెచ్చి విక్రయాలు చేస్తే ఈ సిండికేట్ వ్యాపారులే ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చి కేసులు బుక్ చేయిస్తుంటారు. ఇలా మండలంలోని అన్ని గ్రామాలలో కలసి మొత్తం 400 లకు పైగా బెల్టు దుకాణాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదనే చెప్పవచ్చు. ఇలా ఉన్న బెల్టు షాపులపై నిఘా కోసం ఈ మద్యం సిండికేట్ ఇద్దరు వ్యక్తులను నియమించి నిత్యం చెకింగ్ లకు పంపిస్తూనే ఉంటుందంటే వీరి వ్యాపార తెలివి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
బెల్టుషాపులకు ఎమ్మార్పీ కంటే ఎక్కువ…
బెల్టు షాపుల నిర్వాహకులకు ఈ మద్యం సిండికేట్ కేవలం క్వార్టర్, ఆఫ్ లను మాత్రమే హోల్ సేల్ దుకాణంలో విక్రయిస్తారు. అదీ క్వార్టర్ పై రూ.5, ఆఫ్ బాటిల్ పై రూ.10 లను ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయిస్తారు. ఇలా ఎమ్మార్పీ ధరకంటే ఎక్కువకు కొనుగోలు చేసిన బెల్టు షాపుల వారు మరో 20 రూపాయలు అదనంగా జోడించి గ్రామాల్లో విక్రయాలు చేసి మందు బాబుల జేబులకు చిల్లులు పెడుతూనే ఉన్నారు.
అధికారులంతా గప్ చుప్.. షాద్ నగర్ పట్టణంతో పాటు ఫరూక్ నగర్ మండలంలో ఇంత బహిరంగంగా విచ్చల విడి అక్రమ మద్యం దందా కొనసాగుతున్నా ఎక్సైజ్, ఎస్ఓటి, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నోరు మెదపకుండా ఉన్నారంటే వారికి తెలిసే ఈ తతంగం అంతా కొనసాగుతుందని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.
4 హోల్ సేల్ కౌంటర్ ల పరిస్థితి ఇలా ఉంటే… బార్ లను తలపిస్తున్న పర్మిట్ రూమ్ లపై రేపు మరో ప్రత్యేక కథనం..
ఇవి కూడా చదవండి ..
- అక్రమ కట్టడాల కూల్చివేతపై జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేత
- ల* కొడకా… జర్నలిస్ట్ ను బండ బూతులు తిట్టిన అమెరికా అధ్యక్షుడు
- లోటస్ పాండ్ కు తాళం,, షర్మిల చేతులెత్తేసిందా..?
- ‘భీమ్లా నాయక్’తో మారిన పద్మశ్రీ మొగులయ్య జీవితం..