
ప్రజా సమస్యలు మరిచిపోయి ప్రజా ప్రతినిధుల సేవలోనే ప్రస్తుతం ఎక్కువ మంది సివిల్ సర్వెంట్లు తరిస్తున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా వాళ్ల తీరు మారడం లేదు. కాని అందుకు భిన్నంగా ఫిర్యాదులు అంది వంద రోజులు గడుస్తున్నా ఇంకా పరిష్కారం కాకపోవడంతో ఓ కలెక్టర్ తనకు తానుగా శిక్ష విధించుకున్నాడు. పని జరగలేదు కాబట్టి డిసెంబర్ నెలకు గాను తనకు రావాల్సిన జీతాన్ని ఆపాలని అధికారులకు సూచించారు. ఈ పని చేసింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పుర్ జిల్లా కలెక్టరు కరంవీర్ శర్మ.
జిల్లా కలెక్టర్ కరంవీర్ శర్మ తన కార్యాలయంలో శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సమయంలో సీఎం హెల్ప్‌లైన్‌కు వచ్చిన ఫిర్యాదులు 100 రోజులు దాటినా పెండింగ్‌లోనే ఉన్నాయని ఆయన దృష్టికి వచ్చింది. దీంతో సంబంధిత అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ నేపథ్యంలో సమస్యలు పెడింగ్ లో ఉన్నందునా ఈ నెల తనకు రావాల్సిన జీతాన్ని నిలిపివేయాలని, అలాగే స్వచ్ఛత, హెల్ప్‌లైన్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ల జీతాలను కూడా నిలిపివేయాలని జిల్లా కోశాధికారిని కలెక్టర్ ఆదేశించారు.
రెవెన్యూ కేసుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన తహశీల్దార్ల ఇంక్రిమెంట్లను కూడా ఆపాలని ఆదేశించారు కలెక్టరు కరంవీర్ శర్మ. సమీక్షకు హాజరుకాని జిల్లా మార్కెటింగ్ అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కరంవీర్ శర్మ తీసుకున్న నిర్ణయం పట్ల నెటిజన్లు అభినందిస్తున్నారు. మీరు తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్ లో మరెందరో అధికారులు చురుకుగా పని చేసేలా స్ఫూర్తి నింపుతుందని, ప్రజా సమస్యల పరిష్కారం మరింత వేగవంతం అవుతాయని ప్రశంసిస్తున్నారు.