
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ప్రపంచ దేశాలను వణికిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మన దేశంలోనూ వేగంగా విస్తరిస్తోంది. భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 11 రాష్ట్రాలకు పాకేసింది. డెల్టా రకం కన్నా 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందే లక్షణంతో ఒమిక్రాన్ కేసులు మన దేశంలో 111గా నమోదైనట్టు కేంద్రం ప్రకటించింది. కొత్తగా మహారాష్ట్రలో మరో ఎనిమిది మందిలో ఈ కొత్త వేరియంట్ వెలుగుచూడగా.. కేరళలో మరో రెండు కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 40కి చేరింది. ఢిల్లీలో 22, రాజస్థాన్ 17, కర్ణాటక 8, తెలంగాణ 8, కేరళ 7, గుజరాత్ 5, ఏపీ, చండీగఢ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఒక్కొక్కటిచొప్పున ఒమిక్రాసన్ కేసులు నిర్దారణ అయ్యాయి.
ప్రస్తుతం యూరప్ లో ఒమిక్రాన్ విలయతాండవం చేస్తోంది. బ్రిటన్, ఫ్రాన్స్ లో హాస్పిటల్స్ అన్ని కొవిడ్ రోగులతో నిండిపోయాయి. చికిత్స అందించ లేక వైద్యులు చేతులెత్తేస్తున్నారు. యూకే, ఫ్రాన్స్ దేశాల్లో ఒమిక్రాన్, కరోనా విజృంభణ స్థాయిని చూస్తుంటే.. అలాంటి పరిస్థితులు గనక భారత్‌లో ఏర్పడితే రోజుకు లక్షలాది కేసులు నమోదయ్యే అవకాశం ఉందని కొవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్ హెచ్చరించారు. యూకే మాదిరి పరిస్థితి భారత్‌లో గనక ఏర్పడితే మన జనాభాను బట్టి రోజుకు 14లక్షల కేసులు వచ్చే అవకాశం ఉందన్నారు.
ఇప్పుడు ఫ్రాన్స్‌లో రోజుకు 65వేల చొప్పున వస్తుండగా.. అక్కడి పరిస్థితితో పోలిస్తే మన జనాభా దృష్ట్యా భారత్‌లో ప్రతిరోజూ 13లక్షల కేసులు నమోదవుతాయంటూ ఉదహరించారు. యూరప్‌లో 80శాతం మేర పాక్షికంగా వ్యాక్సినేషన్ పూర్తయినప్పటికీ డెల్టా ఉద్ధృతి తగ్గడంలేదన్నారు. అందువల్ల ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. గత 20 రోజులుగా మన దేశంలో రోజుకు 10వేలు కన్నా తక్కువ కొవిడ్ కేసులే వస్తున్నప్పటికీ.. ఇతర దేశాల్లో కొత్త వేరియంట్ కేసులు భారీగా నమోదవుతుండటంతో మనం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వీకే పాల్ గుర్తు చేశారు.
అత్యంత వేగంగా వ్యాప్తి చెందే లక్షణం కలిగిన ఈ ఒమిక్రాన్ వేరియంట్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం పదేపదే విజ్ఞప్తి చేస్తోంది. వ్యాక్సిన్ వేయించుకోవడంతో పాటు మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం, జనం రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండటం, అనవసర ప్రయాణాలను మానుకోవడం వంటి చర్యలు తీసుకోవాలని సూచిస్తోంది. వ్యాక్సిన్లు వేయించుకోవడం, మాస్క్ ధరించడం, శానిటైజర్లు వాడకంతో పాటు జనం రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలని అలర్ట్ చేస్తోంది. నూతన సంవత్సర వేడుకలను కొద్దిమందితోనే జరుపుకొనేలా ఏర్పాట్లు చేసుకోవాలని వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి ..
One Comment