
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ : దాదాపు రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కొన్ని రోజులుగా కొంత సద్దుమణిగినట్లు అనిపించింది. వైరస్ పీడ పోతుందని ప్రపంచ దేశాలు ఊపిరీ పీల్చుకుంటున్న సమయంలోనే మరో రూపంలో మహమ్మారి విరుచుకుపడుతోంది. ప్రస్తుతం కరోనా వైరస్ ఓ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ రూపంతో మళ్లీ ప్రపంచం ముందుకు వచ్చింది. దీంతో ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటున్న ప్రజలంతా మళ్లీ వణికిపోతున్నారు. అసలీ ‘ఒమిక్రాన్ అనే వేరియెంట్ ఏమిటి? దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందా? ఒమిక్రాన్ ను కంట్రోల్ చేయడం కష్టమా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి తెలుస్తున్న విషయాలు తీవ్ర ఆందోళన కల్గిస్తున్నాయి. హాంగ్ కాంగ్ లో క్వారంటైన్ కోసమే ఉద్దేశించిన ఓ హోటల్ లో ఒక రూమ్ లోని ఓ వ్యక్తికి కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వచ్చింది. ఆయన దక్షిణాఫ్రికా నుంచి రావడంతో ఎందుకైనా మంచిదని ఎదుటి రూమ్ లో ఉన్న దక్షిణాఫ్రికా నుంచి రాని వ్యక్తికి కూడా పరీక్ష చేయించారు. అయితే ఎదుటి రూమ్ వ్యక్తికి కూడా ఒమిక్రాన్ నిర్దారణ అయింది. దీంతో అంతా షాకయ్యారు. ఇద్దరూ కూడా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నవారే కావడం మరింత కలవరపరుస్తోంది. ఓ వ్యక్తి దగ్గర్నుంచి ఎదుటి గదిలో ఉన్న వ్యక్తికి కూడా ‘డెల్టా’ వేరియెంట్ కన్నా అత్యంత వేగంగా వ్యాపించడంతో ఇప్పుడు ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి.
కరోనా వైరస్ కి కొత్త కొత్త వేరియంట్లు రావడం సహజమే. కాని ఇలా కొత్త వేరియంట్లు వస్తున్నప్పుడు వాటి గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ ‘ఒమిక్రాన్ వేరియంట్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా ప్రకటించింది. బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాతే డెల్టాను ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా పేర్కొన్నారు. కానీ… ఒమిక్రాన్ విషయంలో మాత్రం కేవలం వంద మందికి సోకగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.ఈ వేరియంట్ విస్తృతంగా ఉన్న సౌతాఫ్రికా నుంచి విమానాలను అనేక దేశాలు ఇప్పటికే నిషేధించాయి.
ఆ జన్యు ఉత్పరివర్తనాలు ఒక మేరకు మించి జరిగినప్పుడు అది అంతకుముందున్న వేరియంట్ కంటే పూర్తిగా భిన్నమైనదని శాస్త్రవేత్తలు భావించినప్పుడు… దాన్ని ‘కొత్త వేరియంట్ గా పిలుస్తారు. ఇప్పటివరకు కరోనా వైరస్ లో వచ్చిన వేరియంట్లలో అన్నిటికన్నా ఎక్కువగా జన్యు ఉత్పరివర్తనలు జరిగిన వేరియంట్ ఒమిక్రాన్. కరోనాకి సంబంధించిన వేరియంట్లలో ఉత్పరివర్తనాల విషయంలో ఇది రారాజు లాంటిది. ఇప్పటి వరకు 50కి పైగా కొత్త జన్యు ఉత్పరివర్తనాలు ఈ వేరియంట్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాకుండా వీటిలో సుమారుగా 32 ఉత్పరివర్తనాలు… ఒక్క దాని స్పైక్ ప్రోటీన్ లోనే ఉండటాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో కూడా ఫ్యూరీన్ క్లీవేజ్ సైట్ అనే భాగంలో మూడు ఉత్పరివర్తనాలు ఉండటం గమనించారు. ఇందువల్ల ఈ వైరస్ కి యాంటీబాడీస్ ను బైపాస్ చేసుకునే లక్షణం వస్తుందనేది శాస్త్రవేత్తల అంచనా. ఎందుకంటే కరోనా వైరస్ మానవ శరీరంలో ప్రవేశించాలంటే దాని స్పైక్ ప్రోటీన్ ను… మన కణజాలంలోకి చొప్పించాల్సిన అవసరం ఉంటుంది.
యాంటీబాడీస్ తయారుచేయడానికీ, వ్యాక్సిన్ లను రూపొందించడానికీ, మందుల తయారీకీ శాస్త్రవేత్తలు స్పైక్ ప్రోటీన్‌ని ఒక లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పుడు… ఎప్పుడైతే స్పైక్ ప్రోటీన్లో ఎక్కువగా ఉత్పరివర్తనాలు జరుగుతున్నాయో అప్పుడు అనేక రకాలైన మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. దీనిలో ముఖ్యంగా కరోనా వైరస్ మన శరీర కణాలలోకి చొచ్చుకుపోయే విషయంలో ఇంకా వేగవంతమయ్యే అవకాశం ఉంటుంది. రెండవది… మనం తయారుచేసుకున్న వాక్సిన్లను మన శరీరంలోకి ప్రవేశపెట్టాక… అక్కడ అవి ఉత్పత్తి చేసే యాంటీబాడీస్.. ఈ వైరస్‌ని గుర్తించలేకపోవచ్చు. మూడవది… మనం తయారుచేసుకున్న యాంటీవైరల్ మందులు ఈ వేరియంట్ పైన పని చేయకపోవచ్చు. నాలుగోది… మనం తయారుచేసుకున్న సింథటిక్ యాంటీబాడీస్ ఈ వైరస్‌ని ప్రభావితం చేయలేకపోవచ్చు. ఈ కారణాలను బట్టి ఈ ఒమిక్రాన్ వేరియంట్ కు కొన్ని ‘సూపర్ పవర్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు.
ఇవి కూడా చదవండి …
- మహాత్మా జ్యోతిరావ్ ఫులే కృషి అభినందనీయం..
- దగ్దం అయిన ఇసుక లారీ..డ్రైవర్ కు తప్పిన ప్రమాదం
- ట్రాఫిక్ పోలీసుల వసూళ్ల దందా.. స్టింగ్ ఆపరేషన్ తో పట్టేసిన ఎమ్మెల్యే
- మునుగోడు గడ్డపై గర్జించిన ఈటల.. పోటీ ఖాయమేనా?
One Comment