
ఆ విద్యార్థిని 8వ తరగతి చదువుతోంది. ఆమెది పల్లెటూరు కావడంతో హైస్కూల్ కోసం పక్క గ్రామానికి వెళ్లాలి. కాని కోవిడ్ సమయంలో వాళ్ల గ్రామానికి ఆర్టీసీ బస్సు బంద్ అయింది. ఇప్పటికి రావడం లేదు. దీంతో బడికి వెళ్లేందుకు ఆ చిన్నారి చాలా కష్టపడుతున్నది. తన సమస్యను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకుపోయింది. ఆయన ఈ విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ అధికారులకు విన్నవించడంతో.. వెంటనే స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆ చిన్నారి కోరిక తీర్చి హాయిగా బస్సెక్కి బడికి పోయేలా చేశారు.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చీదేడు గ్రామానికి చెందిన వైష్ణవి 8వ తరగతి చదువుతున్నది. 9 వ తరగతి చదివే తమ్ముడితో కలిసి నిత్యం 6 కిలో మీటర్ల దూరంలోని స్కూల్‌కు వెళ్తున్నారు. కరోనా లాక్‌డౌన్ విధించడానికి ముందు చీదేడు గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండేది. ఈ బస్సును తిరిగి పునరుద్దరించకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వీరి గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో వీరిద్దరూ స్కూల్‌కెళ్లేందుకు నిత్యం అష్టకష్టాలు పడుతున్నారు. ఇంటర్ చదువుతున్న వీరి అక్క కూడా గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీకి వెళ్లి వస్తున్నది. ఆమె కూడా బస్సు లేక ఆటోలో వెళ్తూ ఇబ్బంది పడుతున్నది. తండ్రి ఇటీవల కరోనాకు గురై గుండెపోటుతో చనిపోయాడు. తల్లి చిన్నాచితకా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నది. ఈ దశలో నిత్యం ఆటోలకు రూ.150 వరకు చెల్లించే స్థోమత లేని ఈ చిన్నారులు.. చదువు మానుకోవాలనే నిర్ణయానికి వచ్చారు.
అయితే చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టే బదులుగా సమస్యను పరిష్కరించుకోవాలని యోచించిన చిన్నారి వైష్ణవి.. తమతో పాటు ఇతర విద్యార్థులు పడుతున్న కష్టాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రూపంలో తెలిపింది. ఆయన ఆ ఉత్తరాన్ని తెలంగాణ ఆర్టీసీ అధికారులకు పంపి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై వెంటనే స్పందించిన టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చీదేడు గ్రామానికి బస్సు సౌకర్యాన్ని పునరుద్దరించారు. ఎప్పటిమాదిరిగా బస్సులు నడుస్తుండటంతో స్కూల్‌కెళ్లి బాగా చదువుకోవచ్చని ఆ చిన్నారి సంతోషం వ్యక్తం చేసింది. తమకు సహకరించిన ఎన్వీ రమణతోపాటు సజ్జనార్‌కు కృతజ్ఞతలు తెలిపింది.