
- అయినా పట్టించుకోని అధికారులు
- అప్పుడే కుంగిపోతున్న బేస్ మెంట్
- ఇది ఇసుకా ? లేకపోతే మొరమా ?
- అధికారులే చెప్పాలి …. గుత్తేదారు కే తెలియాలి
(ఉప్పల వెంకటేష్ రజక )
క్రైమ్ మిర్రర్ , సంస్థాన్ నారాయణపురం ; అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలంటూ ఉకదంపుడు ఉపన్యాసాలు చెప్పే నేతలు …తాముసొంతంగా కాంట్రాక్టు పనులు చేస్తూ అదే నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలిస్తూ, అందినకాడికి దండు కుంటున్న వైనం యదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని మహ్మదాబాద్ గ్రామ వైకుంఠ ధామం నిర్మాణ పనుల్లో గుత్తేదారు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకుండా, నిబంధనలకు పూర్తి విరుద్ధంగా నాసిరకపు పనులు చేపడుతున్నారు. ఇంత జరుగుతుంటే అధికారులు ఏమి చేస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం లేకుండా పోయింది.
వైకుంఠ ధామం కోసం నిర్మించిన భవన బేస్ మెంట్ పూర్తిగా అప్పుడే కుంగిపోయి కన్పిస్తున్నా అధికారులు, గుత్తేదారును పిలిచి మంద లించకపోవడం వెనుక మతలబు ఏమిటన్న అంతు చిక్కడం లేదు. వైకుంఠ ధామం నిర్మాణ పనులను చేపడుతున్నది అధికార పార్టీ నాయకుడు కావడం వల్లే నాసిరకంగా అతడు నిర్మాణ పనులను చేపడుతున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఇకపోతే నిర్మాణానికి మేలురకమైన ఇసుక వాడాల్సి ఉండగా, మొత్తంగా నాసిరకమైన ఇసుక వాడుతూ, భవన నిర్మాణ పనులను పూర్తి చేస్తుండడం పట్ల స్థానిక గ్రామస్తులు ఎన్నిమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న పాపాన పోవడం లేదని మండిపడుతున్నారు. కాంట్రాక్టర్, అధికారులు మిలాఖత్ అయిపోయి నాసిరకపు నిర్మాణ పనులను చేపడుతూ, ప్రజాధనాన్ని లూటి చేస్తున్నారని ద్వజమెత్తారు.
నాణ్యత ప్రమాణాలు పాటించాలి… లేకపోతే ఆందోళన చేస్తాం
మహ్మదాబాద్ గ్రామ వైకుంఠ ధామం నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని స్థానిక గ్రామ ఉప సర్పంచ్ మునగాల మాధురి సమరసింహా రెడ్డి , వార్డు సభ్యుడు నల్లబోతు చైతన్య యాదవ్, ముత్యాల కవిత, ముత్యాల రమేష్, డైరెక్టర్ ముత్యాల అంజయ్య తో పాటు గ్రామస్థులు డిమాండ్ చేశారు. వైకుంఠ ధామం నిర్మాణ పనుల్లో నాసిరకమైన ఇసుక వాడుతున్న విషయాన్నీ అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళిన వారు పట్టించుకోవడం లేదన్నారు. ఇదే అదనుగా గుత్తేదారు పూర్తి నాసిరకంగా పనులు చేపడుతూ ప్రజాధనాన్ని స్వాహా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వైకుంఠ ధామం నిర్మాణ పనుల్లో గుత్తేదారు నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షం లో ప్రజా ఆందోళన నిర్వహిస్తామని మునగాల మాధురి సమరసింహా రెడ్డి, నల్లబోతు చైతన్య యాదవ్, ముత్యాల కవిత, ముత్యాల రమేష్, డైరెక్టర్ ముత్యాల అంజయ్య హెచ్చరించారు.