

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ శాసనమండలి ఖాళీల భర్తీకి ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. హుజురాబాద్ ఉప సమరం ముగియగానే ఐదు నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికల నగారా మోగడంతో మరో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఎమ్మెల్యేల కోటాలో ఆరు ఎమ్మెల్సీ సీట్లు భర్తీ కానున్నాయి. అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న బలాబలాల ఆధారంగా ఆరు సీట్లు అధికార టీఆర్ఎస్ కే దక్కనున్నాయి. దీంతో అధికార పార్టీలోని అశావాహులంతా లాబీయింగ్ తీవ్రతరం చేశారు. సీఎం కేసీఆర్ ప్రసన్నం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ సీట్ల కోసం పార్టీలో తీవ్ర పోటీ ఉండటంతో కేసీఆర్ ఎవరిని ఖరారు చేస్తారన్నది ఆసక్తిగా మారింది.
శాసనమండలి మాజీ చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, బోడికుంట్ల వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఆకుల లలిత, ఫరీదుద్దీన్,ల ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసింది. వీళ్లలో గుత్తా సుఖేందర్‌రెడ్డికి మరోసారి అవకాశం ఖాయమంటున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరిగినా.. ఆయనే వద్దన్నారనే చర్చ జరిగింది. ఎమ్మెల్సీ బెర్త్ ఖాయమైనట్లు కేసీఆర్ నుంచి గుత్తాకు సిగ్నల్ వచ్చిందంటున్నారు. కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరినప్పుడే హామీ ఇచ్చినందున ఆకుల లలితకు మళ్లీ అవకాశం ఉంటుందని అంచనా వేసుకుంటున్నారు. మిగితా నాలుగు స్థానాల కోసం పలువురు పోటీ పడుతున్నారు.
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా టికెట్ కోసం పోటీ పడిన ఎంసీ కోటిరెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీంతో ఆయన రేసులో ఉన్నారు. ప్రభుత్వ మాజీ విప్ కర్నె ప్రభాకర్ కూడా మరోసారి పదవి ఆశిస్తున్నారు. అయితే గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు నేతి విద్యాసాగర్, కోటిరెడ్డి, కర్నె ప్రభాకర్ నల్గొండ జిల్లాకు చెందిన వారే. దీంతో నల్గొండ జిల్లా నుంచి ఒకరి కంటే ఎక్కువ మందికి అవకాశం ఉండదంటున్నారు. ఇటీవలే పార్టీలో చేరిన ఎల్ రమణ, పెద్దిరెడ్డి కూడా ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు. వీళ్లలో ఒకరిని కేసీఆర్ ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
జగన్‌తో విజయమ్మ.. వైఎస్సార్ ఫ్యామిలీ డ్రామా! (crimemirror.com)
ఉమ్మడి వరంగల్జిల్లా నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి ఈసారి అవకాశం వస్తుందా.. లేదా అనేదానిపై రకరకాల ప్రచారం జరుగుతోంది. దళిత సామాజికవర్గం నుంచి కడియం శ్రీహరికి చాన్స్ ఉంటుందని పార్టీ నేతల్లో కొంత ప్రచారం ఉన్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు ఇవ్వరని చెప్పుకుంటున్నారు. కడియం కాకుండా ఇటీవలే పార్టీలో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు అవకాశం దక్కవచ్చని అంటున్నారు. హుజురాబాద్ రాజకీయాల్లో నాటకీయ పరిణామాల మధ్య టీఆర్ఎస్లో చేరిన కౌశిక్‌రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి కేబినెట్ తీర్మానం చేసి పంపినట్లు అధికారికంగానే ప్రకటించారు. కానీ ఇది పెండింగ్‌లో పడింది. దీంతో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో పంపి.. గవర్నర్ కోటాలో మరొకరిని సిఫారస్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
బొడికుంట్ల వెంకటేశ్వర్లకు కూడా రెన్యూవల్ ఉండవచ్చనే టాక్ వస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత తక్కెళ్లపళ్లి రవీందర్ రావు, తాడూరి శ్రీనివాస్, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ స్పీకర్ మధుసూదనచారీ కూడా ఎమ్మెల్సీ కోసం కేసీఆర్ దగ్గర ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. అయితే సీఎం కేసీఆర్ మైండ్ లో ఎవరన్నది మాత్రం తేలడం లేదు.వీళ్లే కాకుండా కొత్తగా ఎవరూ ఊహించని నేతలకు కూడా కేసీఆర్ నుంచి తీపి కబురు రావచ్చని అంటున్నారు.