
వాజేడు, (క్రైమ్ మిర్రర్ ):- ఛత్తీస్ ఘడ్ సరిహద్దు లో ఈ నెల 25న జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టుల మృతి చెందడంతో 27న మావోయిస్టులు బంద్ పిలుపు ప్రకటించడంతో పల్లెల్లో ఎప్పుడు ఏం జరుగుతోందనే ప్రజలు భయాందోళనకు గురయ్యారు.నిన్న జరిగిన బంద్ లో ఏజెన్సీ ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అడవులను జల్లెడ పడుతూ సరిహద్దు ప్రాంతాలలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో టేకులగూడెం గ్రామంలో పేరూరు ఎస్సై పోగుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అలాగే చండ్రుపట్ల ఎక్స్ రోడ్ వద్ద వాహనాలను తనిఖీ చేశారు.
చత్తీస్ ఘడ్ వైపు వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రయాణికుల వద్ద బ్యాగ్ లు సైతం తనిఖీ చేసి అపరిచిత వ్యక్తులు సమాచారాలు సేకరించారు. సరిహద్దు గిరిజన గ్రామాల్లో పోలీసు బలగాలతో గస్తీ కాస్తూ ముమ్మర తనిఖీలు చేపట్టారు. గ్రామాల్లోకి ఎవరైనా అనుమానితులు వచ్చినట్లయితే వెంటనే సమాచారం అందించాలని అసాంఘిక శక్తులు సహకరించవద్దని పోలీసులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ జవాన్లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.