
తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు
చివరివరకు టీఆర్ఎస్ లోనే కొనసాగుతా
పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చిన ‘తుమ్మల’
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, హైదరాబాదు: తాను టీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్న వార్తల్లో నిజంలేదని ఖమ్మం మాజీ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. మంగళవారం నేలకొండపల్లి మండలంలోని చెన్నారంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల తాను పార్టీ మారుతున్నానంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో వాస్తవంలేదని తేల్చి చెప్పారు. చివరివరకు టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఖమ్మం జిల్లాలో చేపట్టాల్సిన కొన్ని ప్రాజెక్టుల విషయంలో కొంతవరకు జాప్యం జరిగిందన్నారు. అయినప్పటికీ సీఎం కేసీఆర్ పిలుపుతో టీఆర్‌ఎస్‌లో చేరి జిల్లాకు రూ.వేల కోట్ల నిధులను మంజూరు చేయించి ఖమ్మం జిల్లా అభివృద్ధికి కృషి చేశానని వివరించారు. తనను నమ్మి జిల్లా అభివృద్ధికి సహకరించిన సీఎం కేసీఆర్ తోనే కలిసి పనిచేస్తూ పార్టీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తానని ‘తుమ్మల’ స్పష్టం చేశారు. 2014లో టీడీపీ నుంచి ఖమ్మం బరిలో నిలిచిన తుమ్మల.. పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.. ఆ తర్వాతి కాలంలో టీడీపీ నుంచి తుమ్మల, కాంగ్రెస్ నుంచి అజయ్ కుమార్ టీఆర్ఎస్‌లో చేరారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు కీలక నేతలందరినీ కేసీఆర్ టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.
ఈ క్రమంలో తుమ్మలకు ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవి సైతం కట్టబెట్టారు. 2016లో పాలేరు అసెంబ్లీ ఉపఎన్నికలో తుమ్మల గెలుపొందారు. కానీ,.. ఆ తర్వాత 2018లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి చేతిలో తుమ్మల ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నుంచి తుమ్మల ఎక్కడా కనిపించలేదు. పార్టీ సమావేశాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు.
మరోవైపు మంత్రి పువ్వాడ అజయ్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిలు ఖమ్మంలో తమ సత్తా చాటుతుండటంతో పార్టీ సైతం తుమ్మలను పట్టించుకోవడంలేదని, అందుకే తుమ్మల టీఆర్ఎస్ ను వీడుతున్నారనే వార్తలు ప్రకంపనలు సృష్టించడం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో చాలామంది ఈ వార్తలు చూసి నిజమే అనుకోవడం మొదలుపెట్టారు. ఈ తరుణంలో పార్టీ మారడంపై తాజాగా ‘తుమ్మల’ క్లారిటీ ఇస్తూ తను టీఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేయడంతో అపోహలకు తెర పడింది.