
- తుర్కయంజాల్ ఆదిత్యనగర్‌ను ఖాళీ చేస్తున్న ప్రజలు
- సొంత ఇంటిని విడిచి కిరాయి గూటికి పయనం
- ఎఫ్టీఎల్‌లో ఫేక్ అనుమతులతో నట్టేట ముంచారని తిట్ల దండకం
క్రైమ్ మిర్రర్, తుర్కయంజాల్: పోయినేడాది అక్టోబర్‌లో భారీ వర్షాలతో నీట మునిగి రాష్ట్రవ్యాప్త సంచలనంగా మారిన ఆదిత్యనగర్… మరోసారి వెలుగులోకి వస్తోంది. గత మూడురోజులుగా విస్తారంగా కురిసిన వానలతో ఆదిత్యనగర్ మరోసారి నిండా మునిగింది. దీంతో ప్రజలు నీళ్లలో బతకలేక సొంత గూడును వదిలి పిల్లాపాపలతో కలిసి సురక్షితంగా ఉండే కిరాయి ఇళ్లకు మారుతుండటం స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.
మంగమ్మదే ఈ పాపం అంటూ తిట్లదండకం
కొత్తకుర్మ మంగమ్మ సర్పంచ్‌గా ఉన్నప్పుడు నకిలీ పత్రాలతో ఎఫ్టీఎల్ పరిధిలో వెంచర్లకు అనుమతులిచ్చి తమను నట్టేట ముంచారన్న కోపం ఆదిత్యనగర్ వాసుల్లో ఉబికి వస్తోంది. ఎఫ్టీఎల్ పరిధిలో వెంచర్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఇళ్ల నిర్మాణాలకూ భారీగా వసూలు చేసి అనుమతులిచ్చారని వాపోతున్నారు. ఆదిత్యనగర్‌లో నేటికీ నకిలీ గ్రామపంచాయతీ అనుమతులిస్తూ ఇంకా నిండా ముంచే పనిలో ఉన్నారని మండిపడుతున్నారు. ఇళ్లలో ఉండలేక, అమ్ముకోలేక ఎటూ తేల్చుకోలేని దుస్థితికి మంగమ్మే కారణమంటూ తిట్లదండకం అందుకుంటున్నారు. రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఓ ఇంటిని తీసుకోవాలనుకున్న పేదలను ఓ ప్రజాప్రతినిధిగా ఉండి వారినుంచి అందినకాడికి దండుకోవాలన్న దుర్భుద్ది ఆవిడకు ఎలా వచ్చిందని, తమ ఉసురు తప్పకుండా తగులుతుందని వారు శాపనార్థాలు పెడుతున్నారు.
శోభానగర్‌లోనూ ఇదే దుస్థితి
కబ్జాకు గురై చెరువులో నుంచి భారీగా వస్తున్న వరద, పైన నూతనంగా ఏర్పడ్డ కాలనీల నుంచి వస్తున్న వర్షపు నీటితో శోభానగర్ కొట్టుమిట్టాడుతోంది. ఎఫ్టీఎల్ పరిధి అని తెలిసి కూడా నకిలీ గ్రామ పంచాయతీ అనుమతులిచ్చి తమ జీవితాలు ఆగం చేశారని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. మంగమ్మ సర్పంచ్ పదవీకాలం ముగిసిన తర్వాత శోభానగర్‌లో 100కు పైగా నకిలీ గ్రామపంచాయతీ అనుమతులిచ్చి ఇటు కమిషనర్, అటు ఎమ్మెల్యే నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయాన్ని ప్రజలు గుర్తుచేస్తూ తిట్లదండకమందుకుంటున్నారు.
మంగమ్మ పదవీకాలంలో ఉండి చేసిన అక్రమాలు, అవినీతిపై, నకిలీ గ్రామ పంచాయతీ పర్మిషన్లు ఇచ్చి పేదలను ముంచిన వైనంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని, ఎఫ్టీఎల్ పరిధిలో ఉండి క్షోభను అనుభవిస్తున్న బాధితులకు వేరేచోట గూడు కల్పించే ప్రయత్నం చేసి న్యాయం చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు.