

- నిన్నటి వరకు ఒక లెక్క… ఇప్పుడు మరో లెక్క
- ఫామ్‌హౌస్ గోడలు బద్దలు కొట్టి కేసీఆర్‌ను జైలుకు పంపుతాం
- ఈనెల 18న ఇబ్రహీంపట్నంలో 2వ దళిత, గిరిజన సభ
- ఇంద్రవెల్లి గడ్డపై గర్జించిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
- దళిత, గిరిజన దండోరా మహాసభకు లక్షలాది మంది రాక
(ప్రత్యేక ప్రతినిధి క్రైమ్ మిర్రర్)
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ నిర్వహించిన దళిత, గిరిజన దండోరా మహాసభ విజయవంతమైంది. సభకు లక్షలాది మంది జనం తరలిరావడంతో కాంగ్రెస్ నేతల్లో నూతనోత్సాహం కనబడింది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు కార్యకర్తలు, నేతల్లో పునరుత్తేజం కలిగించాయి. నిజాం నవాబులకు ఎదురొడ్డి పోరాడిన కొమురం భీం నడయాడిన గడ్డ ఇదని, ఇంద్రవెల్లి గడ్డపై నిలబడితే రక్తం సలసల మరుగుతోందని, ఈ గాలి పీల్చుకుంటే బానిస బతుకుల నుంచి బయటపడతామన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు సభకు వచ్చినవారిచేత ఈలలు వేయించాయి. ఈ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ 1981 ఏప్రిల్ 20న ఆదివాసీ బిడ్డలు బలైన గడ్డ ఇదని, ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని పునరుద్ఘాటించారు. ఇంద్రవెల్లిలో ప్రపంచంలోనే అద్భుతమైన స్మారక స్థూపం నిర్మిస్తామని అన్నారు. తెలంగాణకు దళితుడిని సీఎం చేస్తానని…
ఆ దరిడ్రుడు కేసీఆరే సీఎం పీఠంపై కూర్చున్నారని దుయ్యబట్టారు. కేబినెట్లో ఉన్న ఏకైక దళితుడు రాజయ్యను అన్యాయంగా తొలగించారన్నారు. ఏప్రిల్ 20న ఇంద్రవెల్లికి వస్తానంటే ప్రభుత్వం అనుమతివ్వలేదన్నారు. అయినా ఇప్పుడు ఇంద్రవెల్లికి వచ్చి అమరవీరులకు నివాళులు అర్పించాన్నారు. ఆదివాసుల తలరాతను మార్చడానికే ఇక్కడికి వచ్చామని, 70ఏళ్ల కాంగ్రెస్ పాలనతో… ఏడేళ్ల కేసీఆర్ పాలనను ప్రజలు పోల్చి చూడాలని పిలుపునిచ్చారు. నిస్సిగ్గుగా, బరితెగించి మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కేసీఆర్‌కు ఉప ఎన్నికలు ఉంటేనే ప్రజలు గుర్తుకు వస్తారని, హుజూరాబాద్‌తో పాటు అన్ని నియోజకవర్గాల్లో దళితబంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంద్రవెల్లి గడ్డపై లక్ష మందితో దండు కడుతామని చెప్పామని, అన్నట్టుగానే సభకు జనం వచ్చి ఆదరించారని అన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు ఆదేశాలతో పోలీసులు ప్రభుత్వానికి కట్టుబానిసలుగా మారారని ఆరోపించారు. నిజాం ప్రభుత్వాన్ని ఖాసీం రజ్వీనే కాపాడలేదు, కేసీఆర్ రాజ్యాన్ని ప్రభాకర్‌రావు కాపాడగలరా? అన్ని ప్రశ్నించారు. కేసీఆర్ చంద్రమండలంలో దాక్కున్నా… రప్పించి మోకాళ్లపై కూర్చోబెడతామన్నారు.
నిన్నటి వరకు ఒక లెక్క… ఇవ్వాళ్లి నుంచి మరో లెక్క… దెబ్బకు దెబ్బ.. ఒక్క దెబ్బకు వంద దెబ్బలు కొడతామని హెచ్చరించారు. ఫామ్‌హౌస్ గోడలు బద్దలు కొట్టి కేసీఆర్‌ను చర్లపల్లి జైలుకు పంపుతామని, కేసీఆర్‌ను బొందపెడతామని అన్నారు. కేసీఆర్, అతని కుటుంబ సభ్యుల తప్పుల లెక్కలు లెక్కిస్తున్నామన్నారు. 20 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని, ఈ 20 నెలలు పార్టీ కోసం కష్టపడినవారిని కడుపులో పెట్టి చూసుకుంటామని అన్నారు. కాంగ్రెస్ ఇప్పటి నుంచి నాయకుల పార్టీ కాదని, కార్యకర్తల పార్టీ అని అన్నారు. కేసీఆర్‌ది రావుల రాజ్యం అని, ఈ రాజ్యంలో దళిత, గిరిజనులకు ఏమీ ఇవ్వరని అన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మే అని పునరుద్ఘాటించారు. ఈనెల 18న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 2వ దళిత, గిరిజన దండోరా మహాసభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.