

మహబూబాబాద్, క్రైమ్ మిర్రర్: అడవుల్లోకి బావకోసం వెళ్లి ముప్పై ఏళ్లపాటు దండకారణ్యంలో బతికి చివరకు కరోనాతో ప్రాణాలు కోల్పోయిన సమ్మక్క ప్రేమ కథ ఇది. అడవుల్లో దళంలో ముఖ్య సభ్యుడుగా ఉన్న యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ సొంత మరదలు జజ్జర్ల సమ్మక్క అలియాస్ శారద. మన్యంలో పుట్టిన వీరి ప్రేమకథకు దండకారణ్యంలో ఎండ్ కార్డ్ పడింది.
నాగరిక సమాజానికి దూరంగా నిత్యం తూటాలు, కన్నీళ్ల మధ్య.. చుట్టాలను వదిలి చట్టాలకు వ్యతిరేకంగా కష్టాలు పడుతూ.. ఏ నిమిషంలో ప్రాణం పోతుందో తెలియని పరిస్థితుల్లో కేవలం బావ కోసం పోయిన మరదలు సమ్మక్క అలియాస్ శారద. మహబూబాబాద్ జిల్లా సొంతూరు గంగారం మండలం మడగూడెంకు చెందిన సమ్మక్క, నారాయణలు సొంతం బావామరదళ్లు. చిన్నప్పటి నుంచి ఒకరంటే మరొకరికి ప్రాణం. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసిన యాప నారాయణ, విద్యార్థి దశలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ తో ప్రభావితమై 1991 తరువాత దళంలో చేరాడు.