
క్రైమ్ మిర్రర్, శంషాబాద్ : ఇకపై గాంధీభవన్ మెట్లక్కని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తేల్చిచెప్పారు. టీపీసీసీ నూతన కార్యవర్గం ఎన్నికపై కోమటిరెడ్డి మాట్లాడుతూ.. టీపీసీసీ కాదు అది టీడీపీ పీసీసీగా మారిపోయిందన్నారు. ఓటుకు నోటు కేసు మాదిరిగానే పీసీసీ ఎన్నిక జరిగినట్లు తనకు ఢిల్లీ వెళ్లాకగానీ తేలియలేదన్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్ పదవిని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఠాగూర్ అమ్ముకున్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలను త్వరలోనే బయటపెట్టనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ కొత్త కార్యవర్గాన్ని అభినందిస్తూ వారి నాయకత్వంలో రాబోయే హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో డిపాజిట్ తెచ్చుకోవాల్సిందిగా ఘాటైన కామెంట్స్ చేశారు. టీడీపీ నుంచి వచ్చిన నేతలు తనని కలవద్దని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా టీ టీడీపీ మాదిరిగానే మారబోతుందని, కార్యకర్తలకు ఇందులో గుర్తింపులేదన్నారు.
రేపటి నుండి ఇబ్రహింపట్నం మొదలుకొని భువనగిరి వరకు పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. ప్రజల మధ్యనే ఉంటూ కొత్త నాయకులను, కొత్త కార్యకర్తలను ప్రోత్సహిస్తానన్నారు. నల్లగొండ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల గెలుపుకోసం కృషి చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా పార్లమెంట్‌లో తన గళం వినిపించనున్నట్లు తెలిపారు. తన రాజకీయ భవిష్యత్‌ను కార్యకర్తలే నిర్ణయిస్తారని ఆయన పేర్కొన్నారు. ఏఐసీసీ ప్రకటించిన నూతన టీపీసీసీ జాబితాలో ఏ స్థాయిలోనూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేరు లేని విషయం తెలిసిందే. టీపీసీసీ అధ్యక్ష బరిలో, కాబోయే టీపీసీసీ ప్రెసిడెంట్ అంటూ విస్తృత ప్రచారం జరిగిన నేపథ్యంలో కనీసం అటు వర్కింగ్ ప్రెసిడెంట్స్ జాబితాలోనూ ఇటు సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్ జాబితాలోనూ ఆయనకు చోటు దక్కని వైనం నెలకొంది.