
నాగార్జున సాగర్, ఏప్రిల్ 01 క్రైమ్ మిర్రర్ : నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న టిఆర్ఎస్ పార్టీ బీసీ అభ్యర్థి నోముల భగత్ కు ప్రముఖ బీసీ నేత ఆర్ కృష్ణయ్య సంపూర్ణ మద్దతు ప్రకటించారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి భగత్ కు14 బీసీ కులాలు, 47 బీసీ కుల సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. బిసి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ అధ్యక్షతన హైదరాబాద్ కాచిగూడ లో గురువారం పలు బీసీ సంఘాల నేతల సమావేశం జరిగింది. ఈసమావేశంలో యాదవ, ముదిరాజ్, గౌడ, రజక, శాలివాహన, మేదరి, మున్నూరు కాపు కాపు సంఘాల నాయకులు, బిసీ టీచర్ల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ దివంగత బలహీన వర్గాల నేత నోముల నర్సింహయ్య విద్యార్ధి దశ నుండే ఎస్సీ ఎస్టీ బీసీల సమస్యలమీద ఉద్యమాలు చేసినారని గుర్తు చేసుకున్నారు. నిత్యం బడుగు బలహీన వర్గాలకోసం పరితపించిన నోముల ఆశయాలను భగత్ ను గెలిపించడం ద్వారా ముందుకు తీసుకు పోవాల్సిన అవసరం వున్నదన్నారు. నాగార్జున సాగర్ జనరల్ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థి నోముల భగత్ని గెలిపించుకోవాలని పలు బిసి సంఘాలు తీర్మానం చేశారు.