
ప్రజలకు అందుబాటులో ఉండడు… పనులు జరగవు
కాసులు కురిపించే వాటి దగ్గర మాత్రం ఠక్కున మెరుస్తాడు
తుర్కయంజాల్‌లోని ఓ అక్రమ వెంచర్‌లో భారీగా ముడుపులు అందుకున్నట్లు ఆరోపణలు
వచ్చిన అనతికాలంలోనే అతి ఘోరమైన అధికారిగా పేరుగాంచిన కమిషనర్
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : కమీషన్ల కోసమే కమిషనర్ అన్నట్టుగా తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లా వ్యవహారాలు నడుపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఫీల్డ్ వర్క్ పేరుతో సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. కాసులు కురిపించే ఇంజినీరింగ్, టౌన్ ప్లాన్ పనులు తప్ప మిగతా పనులు గాలికొదిలేశారంటూ స్థానికులు బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు.
తుర్కయంజాల్ రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 644, 645, 646లో వెలసిన అక్రమ వెంచర్‌లో కమిషనర్ షఫీ ఉల్లాకు భారీగా పైకం ముట్టిందన్న విమర్శలు బాహాటంగా విన్పిస్తున్నాయి. ఈ అక్రమ వెంచర్‌పై అప్పటి అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి వేసిన కేసు పెండింగ్‌లో ఉండగానే క్రయవిక్రయాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్లాట్లకు అనుమతులు మంజూరు చేయడంలో కమిషనర్ షఫీ ఉల్లా పెద్ద మొత్తంలో తాయిలాలు అందుకున్నాడన్న ఆరోపణలు బహిరంగంగా వ్యక్తమవుతున్నాయి. కమిషనర్ షఫీ ఉల్లా సూచన మేరకు నలుగురు పార్టనర్లు ఒక్కొక్కరి పేరుపై పదికి మించి ప్లాట్లను పంచుకుని అక్రమ డాక్యుమెంట్లు సృష్టించి విక్రయాలు జరుపుతున్నట్లు చెప్పుకుంటున్నారు. కమిషనర్ జోక్యం, అండతో కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే అక్రమ వెంచర్‌లో ప్లాట్ల కొనుగోలు, అమ్మకాలు ప్రస్పుటంగా జరుగుతున్నాయని చెబుతున్నారు.
కమిషనర్ షఫీ ఉల్లా అక్రమ వసూళ్లకు పాల్పడే క్రమంలో దేవుడి, ప్రార్థనామందిరాలను కూడా అడ్డుపెట్టుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు. ఫలానా ప్రార్థనామందిరంలో మౌలిక వసతుల కల్పనకు ఇంత కావాలని, తన మనిషి అక్కడ ఉంటాడు వెళ్లి కలవాలని చెబుతున్నాడన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. మైనార్టీ మినిస్టర్ తనకు అత్యంత ఆప్తుడంటూ, ఏది జరిగినా తనను చూసుకుంటాడని బహిరంగంగా చెప్పుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు.
ప్రజాప్రతినిధులు కానీ, రాజకీయ నాయకులు కానీ, చివరికి పైఅధికారులన్నా అతనికి లెక్కలేని తనం… ప్రజల తరుపున ఎవరైనా ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తే కేసుల పేరుతో బెదిరింపులు… అటు పాలకులకు, ఇటు ప్రజలకు కొరకరాని కొయ్యగా మారిన షఫీ ఉల్లాపై సర్వత్రా విమర్శలు వినబడుతున్నాయి.
తుర్కయంజాల్ పట్టణ ప్రణాళిక అధికారి ఉమ, అకౌంటెంట్ మంజులను చెప్పు చేతల్లో పెట్టుకుని షఫీ ఉల్లా తన వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుంటున్నారన్న ఆరోపణలు పెల్లుబుకుతున్నాయి. కొన్నాళ్ల పాటు పార్క్ స్థలాలు కబ్జాకు గురయ్యాయంటూ బోర్డులు పాతి హడావుడి చేసిన కమిషనర్… ఇప్పుడు చల్లబడటానికి భారీగా ముడుపులు చేతులు మారడమే కారణమంటున్నారు.