
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి – హైదరాబాద్
తెలంగాణ కాంగ్రెస్ వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పార్టీకి కష్టకాలంలో అండగా నిలుస్తున్న కొద్దిమంది నాయకులు కూడా ఒక్కొక్కరుగా తమ దారి చూసుకుంటున్నారు. గతంలో టీఆర్‌ఎస్‌లోకి వరుసపెట్టిన నేతలు.. ఇప్పుడు కాషాయ దళంలో చేరుతున్నారు. టీకాంగ్రెస్‌కి మరో భారీ షాక్ తగిలింది. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేసిన ఆయన కాషాయదళంలో చేరిపోయారు. తెలంగాణ బీజేపీ నేతలతో కలసి ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కమల తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రి, సీనియర్ నాయకురాలు డీకే అరుణ డాక్టర్ కే లక్ష్మణ్ వెంట ఉన్నారు. కుత్బుల్లాపూర్‌లో బలమైన నాయకుడిగా ఉన్న శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్‌ను వీడి కమల తీర్థం పుచ్చుకోవడం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా చెప్పొచ్చు.
గత 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడిన శ్రీశైలం గౌడ్.. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన అందుకు గల కారణాలను వివరిస్తూ వీడియోను విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా విఫలమైందని.. అంతర్గత కుమ్ములాటలతో ప్రజా సమస్యలపై పోరాటాలను విస్మరించిందని ఆయన తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిగా.. ప్రజాపోరాటం బీజేపీతోనే సాధ్యమని భావించి కమలం పార్టీలో చేరుతున్నట్లు ఆయన చెప్పారు.