
కేసీఆరే కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కొత్త పార్టీని పెట్టిస్తున్నట్టు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఎదుర్కొనేందుకు కేసీఆర్ అమలు చేయబోయే వ్యూహాల్లో ఇది కూడా ఒకటని బండి సంజయ్ చెబుతున్నారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయకుండా మరికొంత కాలం ఆగుతారనీ, తనకు ఈ మేరకు సమచారం ఉందని కూడా బండి సంజయ్ చెబుతున్నారు.
క్రైమ్ మిర్రర్ న్యూస్ : తెలంగాణలో టీఆర్ఎస్‌కు కొత్త కష్టాలను తెస్తున్న బీజేపీని ఎదుర్కొనేందుకు గులాబీ బాస్ వ్యూహాలను రచిస్తున్నారా.? బండి సంజయ్ దూకుడును, తెలంగాణ బీజేపీని ఎదుర్కొని, 2023లో జరగబోయే ఎన్నికల్లో మళ్లీ గులాబీ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు పక్కా స్కెచ్ గీస్తున్నారా.? తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపైకి మరో కొత్త పార్టీ రాబోతోందా.? కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీకి తోడుగా మరో కొత్త పార్టీ 2023లో పోటీ చేయబోతోందా..? అంటే, అవుననే అంటున్నారు తెలంగాణ బీజేపీ అధినేత బండి సంజయ్. తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోందంటూ ఆదివారం ఆయన సంచలన కామెంట్స్ చేశారు. అది కూడా కేసీఆరే దగ్గరుండి మరీ కొందరు ఎమ్మెల్యేలతో కొత్త పార్టీని పెట్టిస్తున్నట్టు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఎదుర్కొనేందుకు కేసీఆర్ అమలు చేయబోయే వ్యూహాల్లో ఇది కూడా ఒకటని బండి సంజయ్ చెబుతున్నారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయకుండా మరికొంత కాలం ఆగుతారనీ, తనకు ఈ మేరకు సమచారం ఉందని కూడా బండి సంజయ్ చెబుతున్నారు.
‘అందరూ అనుకుంటున్నట్టు మంత్రి కేటీఆర్‌ను, కేసీఆర్ సీఎంను చేయరు. వచ్చే ఎన్నికల దాకా ఆయనే సీఎంగా ఉంటారు. ఈ లోపు ఒక నలుగురు అయిదుగురు ఎమ్మెల్యేలతో కొన్ని కీలక వ్యాఖ్యలను కేసీఆరే చేయిస్తారు. మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీ నుంచి వెళ్లిపోతామని ఓ నలుగురు అయిదుగురు ఎమ్మెల్యేలు బెదిరింపు వ్యాఖ్యలు చేస్తారు. ఆ తర్వాత వారితోనే ఓ కొత్త పార్టీని పెట్టిస్తారు. తద్వారా కేటీఆర్‌ను సీఎంను చేయకుండా ఎన్నికల వరకు ఆపుతారు. కొత్త పార్టీతో తెలంగాణ ప్రజలను మభ్య పెడతారు. బీజేపీకి వచ్చే ఓట్లను చీల్చేందుకు, ప్రభుత్వ వ్యతిరేక ఓటును మళ్లించేందుకు కేసీఆర్ ఈ వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు.’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. నిన్ను సీఎంను చేస్తే సర్కారు పడిపోతుందని చెప్పి, కేటీఆర్‌ను సీఎంను చేయకుండా తాత్సారం చేస్తారని ఆయన అన్నారు. అయితే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ పార్టీల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. కేసీఆర్ ఎవరితో పార్టీని పెట్టిస్తారు.? కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలు ఎవరు? అన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. అయితే బండి సంజయ్ చెబుతున్నట్టుగా టీఆర్ఎస్‌లో అసంతృప్త ఎమ్మెల్యేల సంఖ్య పెద్దగా లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒక వేళ బండి సంజయ్ చెబుతున్నట్టు కేసీఆరే స్వయంగా ఓ పార్టీని కొందరు ఎమ్మెల్యేలతో పెట్టించినా, అది టీఆర్ఎస్‌కు నష్టమే కానీ, బీజేపీకి కాబోదని విశ్లేషకుల అంచనా. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా, ప్రతిపక్షంలో ఏ పార్టీ బలంగా పోరాడుతోందో, అటువైపే మళ్లుతుందనీ, ఎన్ని పార్టీలు ఉన్నా వారికి నష్టం ఉండదని చెబుతున్నారు. ఇటీవల జరిగిన దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల్లో, కాంగ్రెస్ ఉన్నా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా బీజేపీ మళ్లిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కాగా, కేసీఆర్ కొత్త పార్టీని పెట్టించడం అనేది అసలు నిజమేనా.? లేక టీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు బండి సంజయ్ వదిలిన ఓ అస్త్రమా.? అని అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా బండి సంజయ్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారడం గమనార్హం.