
తన పనితీరుతో ఆకట్టుకుంటోన్న తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్
భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలపై కమిషనర్ షఫీ ఉల్లా ఉక్కుపాదం
ఇప్పటికే 14 పార్కు స్థలాలకు కబ్జాకోరుల చెర నుంచి కాపాడిన షఫీ ఉల్లా
టీపీవో, మున్సిపల్ సిబ్బంది సహకారంతో దూసుకెళ్తోన్న మున్సిపల్ కమిషనర్
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లా అక్రమార్కుల గుండెల్లో వణుకుపుట్టిస్తున్నారు, తుర్కయంజాల్‌కు వచ్చిన అనతికాలంలోనే తన పనితీరు ఏపాటిదో రాజకీయ నాయకులకు, అక్రమ నిర్మాణదారులకు, భూకబ్జాదారులకు తెలిసేలా చేశారు. ప్రజాప్రతినిధుల, రియల్టర్ల ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా తన మార్కు పాలనతో ముందుకు దూసుకెళ్తున్నారు. ఇప్పటికే టీపీవో ఉమ, మున్సిపల్ సిబ్బంది సహకారంతో తుర్కయంజాల్, మన్నెగూడ, రాగన్నగూడ, ఇంజాపూర్‌లో 14 పార్కు స్థలాలకు కబ్జాదారుల చెర నుంచి విముక్తి కల్పించారు. అనేక అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేయించారు. ముఖ్యంగా సాగర్ రహదారిపై వెలసిన బహుళ అంతస్థుల భవనాలను, షట్టర్లను, షెడ్లను ఏమాత్రం బెరకు లేకుండా, రాజకీయ నేతల సమక్షంలోనే కూల్చివేయించడం తన మొక్కవోని ధైర్యాన్ని, శైలిని తెలియజేసింది. వారంలో కనీసం రెండురోజులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, మున్సిపల్ పరిధిలో ఎక్కడ ఏం జరుగుతోందో నిశితంగా పరిశీలిస్తూ తన పరంపరను కొనసాగిస్తున్నారు. షఫీ ఉల్లా గతంలో పనిచేసిన ఖమ్మం జిల్లాలోను, హైదరాబాద్ జల్‌పల్లిలోనూ ఇదే మార్క్ పనితీరుతో అందరి ప్రశంసలను చూరగొన్నారు. రిటైర్మెంట్ దగ్గర పడుతున్న కొద్దీ తన పనితీరును ఇంకా మెరుగుపర్చుకుంటూ, అభివృద్ధి కార్యక్రమాల్లో తను భాగస్వామ్యం అవుతూ ముందుకెళ్తున్నారు.
తుర్కయంజాల్‌లో గతంలో కమిషనర్‌గా పనిచేసిన సురేందర్‌రెడ్డి రాజకీయ నేతలు, సిబ్బంది పట్ల అన్యోన్యంగా ఉంటూ తనపని తాను చేసుకుంటూ వెళ్లేవారు. ముఖ్యంగా రాజకీయ నేతలకు సురేందర్‌రెడ్డి అంటే ఎనలేని అభిమానం ఉండేది. అందరికీ పనులు చేస్తూ… తన పనికి ఆటంకం కలగకుండా చూసుకునేవారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో సురేందర్‌రెడ్డికి ఎదురేలేకుండా ఉండేది. స్థానికంగా ఉండే ఓ ప్లానర్ తనకు సహాయకారిగా ఉంటూ అన్నీ తానై చూసేవాడు. వేలంలో లక్ష రూపాయలు వెచ్చించి వినాయక మండపంలో లడ్డూ కొని… దానిని సురేందర్ రెడ్డికి బహుమానంగా ఇచ్చాడంటే అతనంటే ఆ ప్లానర్‌కి ఎంత అభిమానమో తెలియజెప్పింది. అందరి పనులు చేస్తూ… తన పనికి ఆటంకం కలగకుండా చూసుకోవడంతో సురేందర్‌రెడ్డి మంచివాడన్న ఓ పాజిటివ్ ఇంప్రెషన్‌తో అతను ఇక్కడ నుంచి బదిలీ అయి వెళ్లిపోయారు.
తాజా కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లా పనితీరు సురేందర్‌రెడ్డికి అసలు పోలికే లేకుండా ఉంది. రాజకీయ నేతలను కానీ, ప్లానర్లను కానీ, రియల్టర్లనెవరినీ షఫీ ఉల్లా దరికి చేరనీయడంలేదు. షఫీ ఉల్లా వ్యవహారశైలితో స్థానిక రాజకీయ నేతలకు కంటగింపుగా ఉన్నా. మున్సిపల్ అధికారుల్లో, సిబ్బందికి అతని పట్ల ఎనలేని అభిమానం నెలకొంది. షఫీ ఉల్లా సర్ చాలా మంచి పనులు చేస్తున్నారని వారు నిర్మొహమాటంగా, బహిరంగంగా చెబుతున్నారు. భూకబ్జాదారులు, అక్రమ నిర్మాణదారులంతా రాజకీయ నేతలు, వారి అనుయాయులు కావడంతో షఫీ ఉల్లాపై వారు కొంత ఆగ్రహంగా ఉన్నారు. తమకు అనుకూలంగా వ్యవహరించడంలేదని షఫీ ఉల్లాపై కలెక్టర్‌కు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేవరకు వెళ్లిందంటే పరిస్థితి ఏంటో ఇట్టే అర్థమైపోతోంది. టీపీవో ఉమ, ఇతర మున్సిపల్ సిబ్బంది సహకారం బలంగా ఉండటం, రిటైర్మెంట్ కూడా దగ్గర పడుతుండటంతో షఫీ ఉల్లా మరింత దృఢంగా, ఉత్సాహంగా పనిచేస్తున్నారు. షఫీ ఉల్లా ఇదే పంథాను కొనసాగిస్తూ, అక్రమార్కులను ఉపేక్షించకుండా, సమాజానికి మేలు చేసే సేవలను కొనసాగించాలని క్రైమ్ మిర్రర్ అతని క్షేమాన్ని కాంక్షిస్తోంది.
తుర్కయంజాల్ మున్సిపాలిటీ ఇంజాపూర్ లో ప్రభుత్వ రికార్డు ప్రకారం సర్వే నెం:244/3 లో ప్రభుత్వ ZP పాఠశాల విస్తీర్ణం రెండు ఎకరాలు ఉండాలి.కబ్జాకు గురవుతూ కేవలం 27 గుంటల భూమి మాత్రమే మిగిలింది. మిగతా 53 గుంటల ప్రభుత్వ పాఠశాల స్థలం స్థానిక 13 వ వార్డు కౌన్సెలర్, రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో కబ్జాకి గురవ్వడం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.అలాగే తొర్రురు గ్రామం నుండి ఇంజాపూర్ గ్రామపంచాయతీ మీదుగా సాహేబునగర్ కి ఉండాల్సిన ప్రభుత్వ గ్రామ నక్ష రోడ్డు (సర్వే నెం 249,252 ) 13 వ వార్డు కౌన్సిలర్ బొక్క శ్రీలత గౌతమ్ రెడ్డి కుటుంబం కబ్జా చేయడం జరిగిందని,ఈ యొక్క కబ్జాల పై గ్రామస్థులు అనేకసార్లు RDO మరియు మున్సిపాలిటీ అధికారులకు పిర్యాదు చేసినా తూ..తూ మంత్రంగా వచ్చి ఎటువంటి సర్వే చేయకుండానే వెనుతిరిగారు. ఈ యొక్క కబ్జాపై RDO గారికి ఫిర్యాదు చేసిన ఇంజాపూర్ గ్రామస్తుడు నోముల కృష్ణ గౌడ్ పై సీనియర్ సిటిజన్ అని కూడా చూడకుండా తుర్కయంజాల్ మున్సిపాలిటీ 13 వ వార్డు కౌన్సిలర్ బొక్క శ్రీలత గౌతమ్ రెడ్డి మరిది బొక్క వంశీధర్ రెడ్డి విచక్షణారహితంగా దాడి చేయడంతో వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో IPC: 341,504,506 సెక్షన్ల కింద కేసు(FIR:873/2020) నమోదు చేయడం జరిగింది. ఇప్పటికైనా దయచేసి ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని, గ్రామ నక్ష రోడ్డును సర్వే చేసి కబ్జాకు గురైన స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకోని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.