
సివిల్స్ అభ్యర్థులు మెంటర్‌గా భావించే ఐపీఎస్
ఎక్కడ పనిచేసినా తన మార్క్ సృష్టించుకున్న ఆఫీసర్
అమెరికా ప్రభుత్వం నుంచి హీరో అవార్డ్ అందుకున్న ఐపీఎస్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్నో అవార్డులు, రివార్డులు పొందిన సివిల్ సర్వెంట్
అతనే రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్
మహేష్ భగవత్ ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితం. ఏపీ, తెలంగాణలో సుదీర్ఘంగా పనిచేసిన అనుభవశీలి ఈయన. ప్రస్తుతం రాచకొండ కమిషనర్‌గా తన విధులు నిర్వర్తిస్తూ… ఔత్సాహిక ఐపీఎస్‌లకు దారి చూపుతున్న మహేష్ భగవత్ జీవిత విశేషాలు ఆయన మాటల్లోనే…
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : మా సొంతూరు మహారాష్ట్రలోని రెహమత్‌నగర్ జిల్లాలోని ఓ చిన్న పల్లెటూరు, అక్కడే 10వ తరగతి వరకు చదివాను. 1984లో ఇంటర్ చదివేందుకు పుణె వచ్చా. ఎస్పీ కాలేజీలో ఇంటర్, గవర్నమెంట్ ఇంజినీరింగ్ కాలేజీలో 1990లో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశా. మోక్షగుండం విశ్వేశ్వరయ్య కూడా ఇదే కాలేజీలో ఇంజినీరింగ్ చదివారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక సీనియర్ల సూచనతో సివిల్స్‌కు ప్రిపేర్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నా. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూనే ఓ ఎన్జీవో ద్వారా వాటర్ షెడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో పనిచేశా. రూరల్ డెవలప్‌మెంట్ కోసం కృషి చేశాం. నర్మదా బచావోతో కలిసి మూఢనమ్మకాలపై పోరాడాం. 1993లో మా నాన్నగారు ప్రైమరీ స్కూల్ టీచర్‌గా రిటైర్ అయ్యారు. నేను సివిల్స్ కు ప్రిపేర్ అవ్వాలంటే చాలా డబ్బులు అవసరం. అన్ని డబ్బులు నా దగ్గర లేవు, అన్నీ నువ్వే చూసుకోవాలని నాన్న చెప్పారు. అప్పుడే పుణెలోని టాటా మోటార్స్‌లో ఇంజినీరింగ్ పోస్టు కోసం ప్రకటన వచ్చింది. అందులో 30మంది ఇంటర్వ్యూకు వస్తే నేను సెలక్ట్ అయ్యాను. ఆ కంపెనీలో పనిచేస్తూనే సివిల్స్ ప్రిలిమనరీ పరీక్షలు రాశాను. ప్రిలిమినరీ ఎలాగైనా పాసైతానన్న నమ్మకంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ముంబై చేరుకున్నా. 1995లో ఐపీఎస్‌కు ఎంపికయ్యా. 1996లో హైదరాబాద్‌లో ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తయింది. మొదటి పోస్టింగ్ మణిపూర్‌లో వచ్చింది. తిరిగి 1998 డిసెంబర్‌లో ఏపీ కేడర్‌కి వచ్చా. నా భార్య కూడా అక్కడే పనిచేస్తుండటంతో ఏలూరులో పోస్టింగ్ తీసుకున్నా. ఏలూరులో పనిచేస్తున్న సమయంలో టెలిఫోన్ ఇన్‌కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్‌ను ట్రాప్ చేసిన కేసును ఛేదించాడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా గుర్తింపు వచ్చింది. టెక్నాలజీలో భగవత్‌కు మంచి గ్రిప్ ఉందని పేరు వచ్చింది. దొంగనోట్లు, మంచినోట్లు గుర్తించే టెక్నిక్ అప్పుడే నేర్చుకున్నా. ఏలూరులో ఏడాది పాటు పనిచేశాకా బెల్లంపల్లికి అడిషనల్ ఎస్పీగా వెళ్లా. అప్పుడు సికాసా, అకాస అక్కడ చాలా బలంగా ఉన్నాయి. అప్పుడు నా పనితీరును చూసి అదిలాబాద్ జిల్లాకు 2001లో ఎస్పీగా ఎంపికచేశారు. ఆదిలాబాద్‌లో సుమారు నాలుగేళ్లు పనిచేశా, ఆ జిల్లాలో సమస్యల పరిష్కారానికి నావంతుగా కృషి చేశా. నక్సలిజం ఎక్కువగా ఉండటంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే సమస్య తీరుతుందని భావించాం. వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయడం మొదలు పెట్టాం. జనజీవన స్రవంతిలో కలవాలని నక్సల్స్‌కు పిలుపునిచ్చాం. ప్రాణహాని ఉండదని భరోసా కల్పించాం. నా హయాంలో 150మంది నక్సల్స్ లొంగిపోయారు. అప్పుడు ఆదిలాబాద్ కలెక్టర్లుగా పనిచేసిన వారు నాకు మంచి తోడ్పాటును అందించారు. మారుమూల గ్రామాల్లో మంచినిటీ సమస్యను పరిష్కరించాం. అక్కడ నుంచి హైదరాబాద్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌కు ఎస్పీగా వచ్చిన తర్వాత మానవ అక్రమ రవాణాపై దృష్టి సారించాం. రెండు మూడు ఆపరేషన్లలో (ఢిల్లీ, బివాండీ) నేను స్వయంగా పాల్గొన్నా. చాలా మంది మహిళలకు విముక్తి కల్పించాం. దీన్ని గుర్తించిన అమెరికా ప్రభుత్వం హీరో అవార్డు ఇచ్చింది. అమెరికాలో ఇవాంకా ట్రంప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కొన్ని కారణాల వల్ల నేను వెళ్ల లేకపోయా. తర్వాత హైదరాబాద్ తాజ్ కృష్ణాలో ముగ్గురు కౌన్సిల్ జనరల్‌ల మధ్య జరిగిన కార్యక్రమంలో నాకు అవార్డ్ అందజేశారు. కెనడా ప్రభుత్వం కూడా నాకు ఇంటర్నేషనల్ అవార్డు ఇచ్చింది. అల్వాల్ డీఎస్పీగా పనిచేస్తున్నప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి పిలిచి మరీ కడప ఎస్పీగా వెళ్లమని చెప్పారు. అప్పుడు అక్కడ ఫ్యాక్షనిజం విచ్చలవిడిగా ఉండేది. ఏడెనిమిది నెలలు పనిచేశా. ఫ్యాక్షన్ గ్రామాలకు వెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చాం. వైఎస్ రాజశేఖరరెడ్డి ఓ రోజు ఉదయం 5.30కి ఫోన్ చేశారు. పులివెందుల సమీపంలోని ఓ గ్రామంలో బాంబు బ్లాస్ట్ జరిగిందని, ఇంట్లో మొత్తం క్లీన్ చేశారని చెప్పారు. అప్పటివరకు మా పోలీసు వారికెవరికీ ఈ విషయం తెలియదు. ఎవరికీ తెలియని విషయం సీఎంగారికి ఎలా తెలిసింది అని అనుకున్నా. హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లి విచారించి నిందితులను అరెస్ట్ చేశాం. ఇంటిపక్క ఇళ్ల వారి తగాదాల వల్ల బాంబు బ్లాస్ట్ జరిగినట్లు గుర్తించాం. నక్సలిజం, ఫ్యాక్షనిజంపై నా రికార్డ్ చూసి నన్ను 2009లో ఖమ్మం ఎస్పీగా పంపారు. అక్కడ నుంచి డీఐజీగా ప్రమోషన్‌లో హైదరాబాద్‌కు వచ్చా. ఏలూరు డీఐజీగా వెళ్లినప్పుడు పెద్దాపురం మొత్తం క్లీన్ చేయించాం. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు ఏర్పడినప్పటి నుంచి రాచకొండలో పనిచేస్తున్నా. రాచకొండ చాలా పెద్ద ప్రాంతం. నేను హుషారుగా ఉంటూ కానిస్టేబుళ్ల వరకు హుషారుగా పనిచేయిస్తున్నా. మన ఇల్లు శుభ్రంగా ఉంటేనే సమాజం శుభ్రంగా ఉంటుందని నమ్ముతా. అందుకే పోలీసులు ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకుంటూ వారిలో కొంత భయాన్ని కల్పిస్తున్నా. బుద్ధిగా పనిచేయాలన్న తపన వారిలో రావాలన్నదే నా తాపత్రయం. నేను సివిల్స్‌కు ఎంపిక కాకముందు సివిల్స్ అభ్యర్థులకు క్లాసులు బోధించేవాడిని. ఆ అనుభవం ఉండటంతో సివిల్స్ అభ్యర్థులకు మెంటర్‌గా పనిచేస్తున్నా. వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్నా. ఇప్పటివరకు 800మంది అభ్యర్థులకు మెంటర్‌గా ఉన్నా. సివిల్స్ ఎంపికయ్యే అభ్యర్థులకు నేను ఒకటే సూచన ఇస్తా… ఎవరూ చేయలేని పనిని నేను చేస్తా. సమాజానికి నావంతుగా మంచి చేస్తా అనే ధ్యేయంతో ముందుకు రావాలి.