
సర్వేనెంబర్ 323లోని ప్రభుత్వ భూమి ఏమైనట్లు?
గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు ఎందుకు తడుముకున్నట్టు?
చట్టాల పేరు చెప్పి క్రైమ్ మిర్రర్‌ను బెదిరించలేరు.
ఈ తరహా బెదిరింపులు క్రైమ్ మిర్రర్‌కు కొత్తేమీ కాదు…
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తుర్కయంజాల్ రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 323లోని 55 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని… కొంతమంది రెవెన్యూ అధికారులతో కలిసి రాజకీయ నాయకులు కబ్జాకు పాల్పడ్డారన్న విషయాన్ని ఇటీవల క్రైమ్ మిర్రర్ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వ భూమి కబ్జాపై ప్రశ్నిస్తే కొంతమంది అదే సర్వే నెంబర్‌లో బై నెంబర్ పట్టాదారులు, వాళ్ల మంది మాగాదులు స్పందించడం హాస్యాస్పదంగా కనిపిస్తోంది . గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకోవడం చూస్తుంటే దొంగలెవరో ఇట్టే అర్థమైపోతోంది. 323/4 తమ నాయకుడికి రెండు ఎకరాల 10 గంటల భూమి ఉన్నట్టుగా వారికి వారే ప్రకటించుకుంటున్నారు. అయితే సర్వే నంబర్ 323/4లో ఎవరికి ఎంత భూమి ఉందన్న విషయం ఇక్కడ అప్రస్తుతం అన్నది వారు గుర్తించాలి. ఎందుకంటే సర్వేనెంబర్ 323లోని 55 ఎకరాల ప్రభుత్వ భూమి ఏమైందని, ప్రభుత్వ భూమి పరిరక్షణలో రెవెన్యూ అధికారులు ఎందుకు విఫలమయ్యారని మాత్రమే క్రైమ్ మిర్రర్ ప్రశ్నించింది. ప్రభుత్వ భూమిని కొంత మంది రాజకీయ నాయకులు బై నెంబర్ల పేరిట కబ్జా చేశారని మాత్రమే వెలుగులోకి తెచ్చాం. క్రైమ్ మిర్రర్ ఇప్పటికీ తన కథనానికి కట్టుబడి ఉంది. ప్రభుత్వ భూమి కబ్జా గురించి ప్రశ్నిస్తే కొంతమంది వ్యక్తులు పనిగట్టుకొని అది తమ నాయకుడి గురించి రాసిన కథనం అని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. చట్టరీత్యా చర్యలు తీసుకుంటామంటూ బెదిరింపులకు దిగడం చూస్తుంటే… ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లుగా ఉంది. సమస్యలపై ప్రజల పక్షాన పోరాడాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ తరహా బెదిరింపులు క్రైమ్ మిర్రర్‌కు గతంలోనూ వచ్చాయి. అయినా మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేశాం కానీ… ఎక్కడా వెనకడుగు వేసిన దాఖలాలు లేవు. ఇలాంటి ఉడుత ఊపులకు ఏనాడూ క్రైమ్ మిర్రర్ బెదరదని కబ్జా రాయుళ్లు గ్రహించాలి. ఇక 323/4 సర్వే నెంబర్‌లో రెండెకరాల 10 గుంటల భూమి కలిగిన పట్టాదారు, గతంలో ఎన్ని ఎకరాల భూమిని కలిగి ఉన్నాడని తుర్కయంజాల్ గ్రామ ప్రజలందరికీ తెలుసని స్థానికులు అంటున్నారు.